లక్ష డాలర్ల వీసా!
అమెరికా ఫస్ట్ అంటూ అగ్రరాజ్యం అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వలస విధానాన్ని కఠినతరం చేసే చర్యలను ముమ్మరం చేశారు. అమెరికాలో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలను ఆశించే భారతీయులకు ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు అశనిపాతంగా మారుతున్నాయి. అమెరికాలోని ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలని మొదటినుంచి పట్టుబడుతున్న ట్రంప్ మరోసారి హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచే ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడం అగ్రరాజ్యం వలస విధానంలో పెరుగుతున్న కఠిన ధోరణికి అద్దం పడుతున్నది.
అయితే ఇది కొత్త నిర్ణయమేమీ కాకపోయినా, మరో రూపాన్ని సంతరించుకుని మళ్లీ వస్తుండటం ఆందోళనకరం. గతేడాది సెప్టెంబర్‌లో ట్రంప్ ప్రభుత్వం లక్ష డాలర్ల రుసుము నిబంధనను అధ్యక్షుడి ఉత్తర్వుల ద్వారా తీసుకురాగా, దాన్ని ఫెడరల్ కోర్టు నిలిపివేసిన విషయం విదితమే. కాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడు భారీగా పన్నులను విధించలేరని న్యాయస్థానం పేర్కొన్న నేపథ్యంలో ఈసారి హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ద్వారా చట్టపరమైన మార్గాన్ని అన్వేషిస్తుండటం గమనార్హం.
ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, ప్రధానంగా భారతీయులు తీవ్రంగా ప్రభావితమవుతారు. అమెరికా ఏటా జారీచేసే హెచ్-1బీ వీసాల్లో సుమారు 70 శాతం భారతీయులే దక్కించుకోవడం అందుకు కారణం. ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త కొలువును వెతుక్కునేందుకు ప్రస్తుతమున్న 60 రోజుల వెసులుబాటును తొలగించే ప్రతిపాదనపై కసరత్తు చేస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. కాగా, ఇప్పటికే ఉన్న వీసాల రెన్యువల్‌కు సాధారణ ఫీజును కొనసాగించడం కొంత ఉపశమనమనే చెప్పాలి.
ఉపాధి ద్వారాలు మూతపడుతున్న ప్రస్తుత తరుణంలో అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులకూ ఇబ్బందులు తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వినవస్తున్నాయి. కాగా, అమెరికా ప్రభుత్వ తాజా నిర్ణయాన్ని కేవలం వీసా రుసుము పెంపుగా చూడటం సరికాదు. దీన్ని అమెరికా వలస విధానంలో చోటుచేసుకుంటున్న మార్పులకు సంకేతంగా భావించాలి.
ట్రంప్ సర్కార్ విధానాల మూలంగా ఇప్పటికే హెచ్-1బీ వీసా దరఖాస్తులు సగానికి పైగా పడిపోయాయి. ప్రతిభావంతులైన విదేశీయులను ఆకర్షించడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న అమెరికా, ఇప్పుడు అదే ప్రతిభకు మోకాలడ్డటం శోచనీయం. అయితే, ట్రంప్ వలస వ్యతిరేక విధానాలకు ప్రధాన అడ్డంకిగా మారుతున్న న్యాయపరమైన సవాళ్లను ఎలా అధిగమిస్తారో చూడాలి.






