26 August, 2026 | 3:39 AM

సానుభూతిపరులను విడుదల చేయాలి

26-08-2026 12:00 AM

మావోయిస్టు ఉద్యమంతో సంబంధం ఉందని లేదా ఆ ఉద్యమానికి మద్దతిచ్చారనే ఆరోపణలతో దీర్ఘకాలంగా తెలంగాణలోని పలు జైళ్లలో నిర్బంధంలో ఉన్న వ్యక్తుల కేసులను మానవతా దృక్పథంతో పరిశీలించి, వారిని విడుదల చేయాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డికి మానవ హక్కుల వేదిక విన్నవించింది.

గౌరవనీయులు

శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం.

(ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, ఐఏఎస్ గారి ద్వారా)

విషయం: తెలంగాణ జైళ్లలో దీర్ఘకాలంగా నిర్బంధంలో ఉన్న మావోయిస్టు సానుభూతిపరులు, కార్యకర్తల కేసులను పునఃసమీక్షించి, వారిని విడుదల చేయవలసిందిగా విజ్ఞప్తి.

భారత సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా 314 మంది జీవిత ఖైదీలను విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. ఖైదీల పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని, న్యాయం, మానవతా విలువలను కాపాడేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు హర్షనీయం. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ప్రత్యేక పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాం.

గత ఏడాది కాలంలో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్యమంతో సంబంధం ఉన్న సుమారు 2,500 మంది - అజ్ఞాత జీవితం వీడి జనజీవన స్రవంతిలోకి తిరిగి వచ్చారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారికి పునరావాసం కల్పించడానికి చర్యలు చేపడుతున్నాయి. వారిపై ఉన్న క్రిమినల్ కేసులను కూడా ఆయా ప్రభుత్వాలు సమీక్షిస్తున్నట్టు తెలుస్తున్నది. 

అయితే తెలంగాణలో మావోయిస్టు పార్టీకి మద్దతుదారులు లేదా సానుభూతిపరులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమారు 200 మంది ఇప్పటికీ జైళ్లలో నిర్బంధంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరు మావోయిస్టు ఉద్యమంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఆహారం, నీరు, ఆశ్రయం వంటి ప్రాథమిక సహాయం అందించారనే ఆరోపణలతో జైళ్లలో ఉన్నారు. వీరిలో గణనీయమైన సంఖ్యలో ఆదివాసులు, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారు ఉన్నట్లు మాకు సమాచారం ఉంది.

న్యాయవాదులను నియమించుకోవడానికి, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి లేదా ష్యూరిటీలను సమకూర్చుకోవడానికి అవసరమైన ఆర్థిక, సామాజిక స్థోమత వీరికి లేదు. వారి పరిస్థితిని ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలించాల్సిన అవసరం ఉంది. సుదీర్ఘ కాలం జైలులో ఉండటం వల్ల ఇప్పటికే సామాజికంగా, ఆర్థికంగా అట్టడుగున ఉన్న వారి కుటుంబాలపై మరింత భారం పడుతోంది.

అజ్ఞాత జీవితాన్ని విడిచిపెట్టి లొంగిపోయిన మావోయిస్టు సభ్యుల పునరావాసం కోసం ప్రభుత్వం కొంత ఉదార వైఖరిని ప్రదర్శిస్తోంది. అదే విధంగా వ్యక్తిగత కేసులను చట్టపరంగా పరిశీలించిన అనంతరం, ప్రస్తుతం జైళ్లలో ఉన్న మావోయిస్టు సానుభూతిపరులు లేదా మద్దతుదారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కూడా విడుదల చేయాలని మేం కోరుతున్నాం. ఇటువంటి వ్యక్తుల కేసులన్నింటినీ సమగ్రంగా పునఃసమీక్ష చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని మానవ హక్కుల వేదిక ముఖ్యమంత్రి గారిని కోరుతోంది. 

చట్టపరంగా సాధ్యమైన చోట్ల బెయిల్‌పై విడుదల, కేసుల ఉపసంహరణ లేదా తగిన పునఃపరిశీలన, శిక్ష ఉపశమనం, ఉదారంగా రెమిషన్ ఇవ్వడం, అమలులో ఉన్న ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఇతర ఉపశమన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. తద్వారా వారు తమ కుటుంబాల వద్దకు తిరిగి వెళ్లి, ప్రశాంతమైన జీవితం గడపడానికి అవకాశం కలుగుతుంది.

ఇటువంటి చర్యలు బాధిత ఖైదీలు, వారి కుటుంబాల బాధలను తగ్గించడమే కాకుండా, మానవ హక్కులు, సామాజిక న్యాయం, పునరావాసం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందనే విశ్వాసాన్ని కలిగిస్తాయి. అందువల్ల, ఈ అంశాన్ని సానుభూతితో పరిశీలించి, తగిన చర్యలు తీసుకొని, వారి పట్ల, వారి కుటుంబాల పట్ల మానవతా దృక్పథాన్ని ప్రదర్శించాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.

 డాక్టర్ ఎస్.తిరుపతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

 వి.వసంత లక్ష్మి,

 ఎస్.జీవన్ కుమార్, ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు

 సంజీవ్, ప్రధాన కార్యదర్శి నగర కమిటీ