15-02-2026 01:35:17 AM
ఇండిపెండెంట్, చిన్న పార్టీల అభ్యర్థులపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రత్యేక దృష్టి
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి) : ఇటీవల రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలను అటు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మెజార్టీ స్థానాలే లక్ష్యంగా వ్యూహాలను రచించి అమలుచేశాయి. అయితే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడైన నేపథ్యంలో 36 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడటంతో రాజకీ యం రసకందాయంలో పడింది. ప్రస్తుతం ఇరుపక్షాలు హంగ్ అయిన మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడంపైనే తమ దృష్టిని కేంద్రీకరించాయి.
ఈ క్రమంలో హంగ్‌గా నిలిచిన మున్సిపాలిటీల్లో అధికారం కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య తీవ్ర రాజకీయ పోటీ నెలకొంది. మెజారిటీకి కొద్ది స్థానాలే తక్కువగా ఉన్న పట్టణాల్లో స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతు కీలకంగా మారడంతో, రెండు పార్టీలూ వ్యూహాత్మకంగా కసరత్తు ప్రారంభించా యి. ఇప్పటికే మద్దతు సమీకరణపై ఫోకస్‌పెట్టిన బీఆర్‌ఎస్ మరో పది మున్సిపల్ పీఠాలనైనా కైవసం చేసుకునే లక్ష్యంతో ముందుకువెళ్తుండగా, అధికార పార్టీ కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడంతో పాటు కొత్తగా అధికారం దక్కించు కునేందుకు సమగ్ర కార్యాచరణ అమలుచేస్తోంది.
మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ రాని హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్‌ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే అధికారం కోల్పోయిన చోట్ల మళ్లీ పట్టుబిగించేందుకు, మెజారిటీకి కొద్దిస్థానాలే తక్కువగా ఉన్న మున్సిపాలిటీల్లో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. లక్ష్యంగా పెట్టుకున్న మరో 10 మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకునేలా సమ గ్ర ప్రణాళికలు అమలుచేస్తోంది. తాజా మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని కీలక పట్టణాల్లో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు.
ఈ పరిస్థితిని బీఆర్‌ఎస్ అవకాశంగా తీసుకుంటోంది. స్వతంత్రులు, చిన్న పార్టీల కార్పొరేటర్లను తమవైపు తిప్పుకోవడంపై ప్రత్యేక దష్టి పెట్టింది. స్థానిక స్థాయిలో పార్టీ నాయకులు ఇప్పటికే చర్చలు ప్రారంభించారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, హంగ్‌గా నిలిచిన ము న్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌కు మెజారిటీకి 1 నుంచి 3 స్థానాలే తక్కువగా ఉన్నాయని అంచనా. ఈ నేపథ్యం లో మద్దతు కూడగట్టడం పెద్ద సవా లేం కాదని పార్టీ భావిస్తోంది.
హంగ్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీ కూడా అధికారం కోసం ప్రయత్నా లు చేస్తున్న నేపథ్యంలో, బీఆర్‌ఎస్ వేగంగా అడుగులు వేస్తోంది. ప్రత్యర్థి పార్టీల కంటే ముందుగానే మద్దతు సమీకరించి మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాలను కైవసం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని చోట్ల ఇప్పటికే స్వతంత్ర సభ్యులు బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నా రని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మద్దతు సమీకరణ ప్రక్రియ వేగంగా సాగుతున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో మరో 10 ము న్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ చైర్‌పర్సన్ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారే అవకాశం కనిపిస్తోంది.
కేటీఆర్, హరీశ్‌రావు కీలక భేటీ
పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు ఈ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షిస్తూ, స్థానిక నాయకులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎవరెవరిని సంప్రదించాలి, ఎలాంటి హా మీలు ఇవ్వాలి అనే అంశాలపై కూడా కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగానే కేటీఆర్, హరీష్ రావు నందినగర్ నివాసం లో ప్రత్యేకంగా భేటీ అయినట్టు సమాచారం.
హంగ్ మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేసిన్నట్టు తెలుస్తోంది. గెలిచిన కౌన్సిలర్లు చేజారి పోకుండా జాగ్రత్తపడాలని, స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుంటూ మున్సిప ల్ పీఠాలను కైవసం చేసుకోవాలని పార్టీ ఇంఛార్జీలకు వారు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.
హంగ్ మున్సిపాలిటీల్లో ఎక్కు వ పీఠాలపై గులాబీ జెండా ఎగురవేయా లని పట్టుదలగా ఉన్నట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇండిపెండెంట్ అభ్య ర్థులు గెలిచిన చోట వారి మద్దతు కూడగట్టడంపై స్థానిక బీఆర్‌ఎస్ నేతలను సమా యత్తం చేసేలా కేటీఆర్, హరీష్‌రావు ప్లాన్ చేస్తున్నారు. దీంతోపాటు ఎక్స్‌అఫిషియో ఓట్లను అస్త్రంగా వాడుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆధిపత్యం కోసం..
హంగ్‌గా నిలిచిన మున్సిపాలిటీల్లో అధికారం చేజారకుండా కాపాడుకోవడం, అలా గే అవకాశం ఉన్న చోట్ల కొత్తగా పీఠాలు దక్కించుకోవడం లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూ హాలను అమలు చేస్తోంది. స్వతంత్రులు, చిన్న పార్టీల సభ్యులను ఆకర్షిస్తూ, స్థానిక స్థాయి లో బలమైన రాజకీయ సమీకరణాలకు శ్రీకారం చుట్టింది. హంగ్‌గా ఉన్న మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ప్రధానంగా స్వతంత్ర కార్పొరేటర్లు, వార్డుసభ్యులపై దృష్టి పెట్టింది. స్థానిక అభివృద్ధి హామీలు, పదవుల ప్రాధాన్యత వంటి అంశాలతో మద్దతు కూడగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మెజారి టీకి దగ్గరగా ఉన్న మున్సిపాలిటీల్లో ముందు గా మద్దతు లెటర్లు తీసుకోవాలని నాయకత్వం సూచించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌లు హంగ్ మున్సిపాలిటీల పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నట్లు సమాచారం. సంబంధిత జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఎక్కడ పార్టీ బలం తక్కువగా ఉందో అక్కడ వెంటనే రాజకీయంగా చురుకుగా వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
రాష్ర్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఈ అంశాన్ని వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని చూస్తోంది. మున్సిపల్ అభివద్ధి నిధులు, ప్రాజెక్టులు, పరిపాలనా సహకారం వంటి అంశాలను ప్రస్తావిస్తూ సభ్యులను తమవైపు తిప్పుకునే ప్రయత్నం జరుగుతోంది. హంగ్ మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ వేగంగా మద్దతు సమీకరిస్తున్న నేపథ్యంలో, కాంగ్రెస్ కూడా వెంటనే కౌంటర్ వ్యూహాన్ని అమలుచేస్తోంది.
ఇప్పటికే తమ కు అనుకూలంగా ఉన్న సభ్యులను కాపాడుకోవడం, ప్రత్యర్థి పార్టీలకు వెళ్లకుండా నిరోధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. స్థానిక సంస్థల్లో పట్టు కొనసాగితేనే భవిష్యత్ రాజకీయాలకు బలం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే హంగ్ మున్సిపాలిటీల్లో ఎలాంటి అవకాశాన్ని వదులు కోకుండా, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
బెల్లంపల్లి పీఠంపై గులాబీ జెండా...
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మున్సిపల్ పీఠాలు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య దోబూచులాడుతున్నాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడగా అక్కడ గెలిచిన వారిలో తాజగా ముగ్గురు కౌన్సిలర్లు కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం 34 వార్డులున్నాయి. వాటిలో కాంగ్రెస్‌కు 14, బీఆర్‌ఎస్‌కు 14, ఇండిపెండెంట్‌లకు 5, బీజేపీకి 1 స్థానాలు గెలిచాయి.
అయితే కాంగ్రెస్ తరఫున 26వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలిచిన ఇప్ప కుమారస్వామి, 30 వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలిచిన స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్, 34వ వార్డు నుంచి బీజేపీ తరఫున గెలిచిన కొక్కుల రామ్మూర్తి గులాబీ గూ టికి చేరడంతో ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నా యి. దీంతో బీఆర్‌ఎస్ బలం 17కు చేరింది. ఈ క్రమంలో చైర్మన్ పీఠంపై గురిపెట్టిన బీఆర్‌ఎస్ పార్టీ అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నది.
‘చేతి’లోకి భూదాన్ పోచంపల్లి...
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పో చంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ మున్సిపాలిటీలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అక్కడ హంగ్ ఏర్పడింది. భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలో మొత్తం 13 స్థానాలున్నాయి. వాటిలో కాంగ్రెస్ పార్టీ 6, బీఆర్‌ఎస్ 5, బీజేపీ 1, ఇండిపెండెంట్ 1 స్థానంలో విజయం సాధించాయి.
అయితే ఈ మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్ పీఠం కైవసం చేసుకోవాలంటే 7 సీట్లు కావాలి. దీంతో ఎక్స్ అఫిషియో ఓట్లతో మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. మరోవైపు బీజేపీ, ఇండిపెండెంట్ సభ్యుల మద్దతును కూడగట్టేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. ఈ మున్సిపాలిటీలో గెలిచిన కౌన్సిలర్లను ఇరు పార్టీలు ఇప్పటికే క్యాంపులకు తరలించినట్టు తెలుస్తోంది.