15-02-2026 01:44:03 AM
బహుషా.. ఆ ఆలోచనలో ఉన్నారేమో!
కాంగ్రెస్‌ను, రాహుల్‌ని బలహీనపర్చే ప్రయత్నం ఇది
నేనే పదేండ్లు పదవిలో ఉంటామనేది పార్టీకి నష్టం చేసేదే.. ప్రజలు అసహ్యించు కుంటున్నారు.
విజయక్రాంతి ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వెల్లడి
* కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంలోని కొందరు పెద్దల్ని ఈయన కంట్రోల్‌లో పెట్టుకున్నాడు. ఇక్కడి నుంచి నాయకులు వెళ్లి అక్కడ ఏం చెప్పుకున్నా.. రేవంత్ చెప్పినట్టుగా వినండని అంటున్నారు. అందుకే సీఎం అయిన తరువాత రోజు రోజుకూ రేవంత్‌రెడ్డి బలపడుతున్నారు.
* రాష్ట్రంలోని పేదలకు అండగా ఉండాలని వచ్చాను. రైతులు, యువతను కాపాడుకోవాలి. లక్షలాది కుటుంబాలు మద్యానికి బానిసవుతున్నారు. అందుకే మద్యాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నా. అప్పట్లో కేసీఆర్ పాలనలోనూ ఆంధ్రా కాంట్రాక్టర్లు, ఆంధ్రా పెట్టుబడి దారులు దోచుకున్నారు. ఇప్పుడుకూడా ఈయన వచ్చిన తరువాత మళ్ళీ వారిదే కొనసాగుతోంది.
* బయటకు రేవంత్‌రెడ్డి ఎంతగా మాట్లాడినా.. చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఇక్కడ పాలన కొనసాగుతోంది. ఆంధ్రా కాంట్రాక్టర్లు, ఆంధ్రా పెట్టుబడిదారుల కంట్రోల్‌లోనే ఇక్కడి ప్రభుత్వం ఉంది. పాలసీలను వారే తయారుచేస్తున్నారు. వారు చెప్పినట్టే.. ఇక్కడ చాలా మంది అధికారులు వింటున్నారు. తెలంగాణలోని నిజమైన ఉద్యమకారులు, నిజమైన కాంగ్రెస్‌వాదులు, కాంగ్రెస్ పార్టీ.. వీరందరూ కనుమరుగైపోయి, చంద్రబాబు డైరెక్షన్‌లో ఆంధ్రా పాలకుల చేతుల్లోకి ఇన్ డైరెక్ట్‌గా పరిపాలన వెళ్ళిపోయింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి) : సమైక్య రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో తీవ్ర నష్టం, అన్యాయం జరిగింది.. అందుకే పోరాటంచేసి ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నాం.. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు, రాహుల్‌గాంధీ ప్రయోజనాలే ముఖ్యం. అదే మార్గంలో వెళుతున్నాం. ఇలాంటి సమయంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నేనే రాజు.. నేనే మంత్రి.. మరో పదేండ్ల పాటు నేనే సీఎంను అంటూ చేసిన వ్యాఖ్యలు అటు పార్టీని, ఇటు రాహుల్‌గాంధీని బలహీనం చేస్తున్నాయి.
పైగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు డైరెక్షన్‌లోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తోంది. ఇది తెలంగాణకు, ఇక్కడి ప్రజల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కల్గించేదే. అందుకే అలాంటి వ్యాఖ్యలు తప్పు అని అంటున్నానని.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. తాజాగా సీఎం రేవంత్‌చేసిన వ్యాఖ్యలు, పార్టీలో సీనియర్ నేతల అంతరంగం, పార్టీకి కలిగే నష్టం, మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉంటున్న నాయకుల ఆలోచనలపై రాజగోపాల్‌రెడ్డి ‘విజయక్రాంతి’ దినపత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన చెప్పిన విశేషాలు మీ కోసం..!
విజయక్రాంతి : కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ చెప్పినవారే సీఎం.. పీఎం. కానీ ఇప్పుడు కొత్తగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రాబోయే పదిన్నరేండ్లు నేనే సీఎం అంటున్నారు..
రాజగోపాల్‌రెడ్డి : ఇప్పటికి నాలుగైదుసార్లు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అది తప్పు. నీకు ఒకసారి సీఎంగా అవకాశం వచ్చిది. ఐదేండ్లు ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ, ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చుతూ పరిపాలించాలి. మేమందరం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడితే.. కొత్తగా టీడీపీ నుంచి వచ్చినా.. అదృష్టం కలిసొచ్చి సీఎం అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ ఉం ది. హైకమాండ్‌ను పక్కనపెట్టి.. పదేండ్లు నేనే సీఎంగా ఉంటానని అనడం ఏంటి.. తప్పుకదా?
విజయక్రాంతి : నేనే రాజు.. నేనే మంత్రి అంటూ వ్యాఖ్యానించడం పార్టీపరంగా ఎంత వరకు సరైంది. పార్టీ నేతలందరూ దీనికి మద్దతుగా ఉన్నారా?
రాజగోపాల్‌రెడ్డి : ఎవరి మద్దతు లేదు. సెల్ఫ్‌గా డిక్లేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఇప్పటి సీఎంను ఎన్నుకుం టారు. వచ్చే ఎమ్మెల్యేలు అప్పటి సీఎంను ఎన్నుకుంటారు. ఆయన సొంతంగా ఎలా చెప్పుకుంటారు.. తప్పు. దీనిపై ఎవరూ మాట్లాడటం లేదు. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంలోని కొందరు పెద్దల్ని ఈయన కంట్రోల్‌లో పెట్టుకున్నారు. ఇక్కడి నుంచి నాయకులు వెళ్లి అక్కడ ఏం చెప్పుకున్నా.. రేవంత్ చెప్పినట్టుగా వినండని అంటున్నారు. అందుకే సీఎం అయిన తరువాత రోజు రోజుకూ రేవంత్‌రెడ్డి బలపడుతున్నారు. ఇలా చేస్తే.. కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ బలహీనపడుతారు. అది అందరికీ నష్టం కలిగిస్తుంది.
విజయక్రాంతి: పార్టీని ధిక్కరించినట్టుగా, హైకమాండ్‌ను ఎదిరించినట్టుగా రేవంత్‌రెడ్డి మాట్లా డటంపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తారా..?
రాజగోపాల్‌రెడ్డి: ఇప్పటికే పీసీసీ ప్రెసిడెంట్‌కు, ఏఐసీసీ ప్రతినిధి మీనాక్షీ నటరాజన్‌కు ఫోన్‌చేసి సీఎం చేసిన వ్యాఖ్యలను వివరించాను. పార్టీకి ఇలాం టి వ్యాఖ్యలు మంచివికాదని, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నేతలందరినీ అవమానించినట్టని చెప్పాను. రాహుల్‌గాంధీ ఆలోచన మాత్రం నెక్స్‌టైం బీసీలు రావాలని ఉంది. జాతీయ పార్టీలో ఇలా వ్యవస్థ ఉండదని చెప్పాను. రేవంత్‌రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మా అందరికీ గౌరవం లేకుండా పోతుందని చెప్పాను.
కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతోందని చెప్పాను. ఆల్ ఇండియా కాంగ్రెస్ కాస్తా.. రేవంత్ కాంగ్రెస్ లాగా అవుతోందని మా వేదనను చెప్పాను. వెంటనే జోక్యం చేసుకుని, ఆయనను కంట్రోల్‌లో పెట్టాలని చెప్పాను. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచించాలని చెప్పాం. ఈ ఐదేండ్లలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలి, కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి. మరోసారి పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావానేది ఆ లోచించాలి కానీ.. నేనే పదేండ్లు పదవిలో ఉం టామనేది పార్టీకి నష్టం.
ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ప్రజాస్వామ్యా న్ని కాపాడాలనే.. కేసీఆర్ నియంతపాలన, కుటుంబపాలన, రాజరిక పాలనను ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ ఇప్పుడు నియంతలాగా మాట్లాడితే.. ఎలా? త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో ఇటువంటి వ్యక్తులకు, వ్యాఖ్యలకు స్థానం లేదు. ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేసే మాటలు అవి. కాంగ్రెస్ పార్టీని, పార్టీ నాయకుడిని, కార్యకర్తలను, ప్రజాస్వామ్యాన్ని అవమానించే మాటలు ఇవి. త్వరలో సోని యాగాంధీకి, మల్లిఖార్జున ఖర్గే దృష్టికికూడా ఈ విషయాన్ని తీసుకెళతాను.
విజయక్రాంతి: అంటే పార్టీకి, హైకమాండ్‌కు వ్యతిరేక దిశగా రేవంత్‌రెడ్డి వెళుతున్నారా.. సొంత పార్టీ ఏమైనా పెడతారా?
రాజగోపాల్‌రెడ్డి: ఆయన 10 ఏండ్లు కాదు.. 20 ఏండ్లు ముఖ్యమంత్రిగా ఉండమనండి.. కానీ అందు కు ప్రత్యేకంగా పార్టీ పెట్టుకోమనండి. ఆయనకు బహుషా అదే ఆలోచన ఉన్నట్టుగా కనపడుతోంది. ఈ ఐదేండ్లలో బాగా సంపాదించుకుని.. ఫ్యూచర్‌లో పార్టీ పెట్టుకుని పరిపాలించాలని అనుకుంటున్నారే మో.
అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారేమో. కానీ కాంగ్రెస్ పార్టీలో రెండోసారి ముఖ్యమంత్రి కావాలంటే.. రాహుల్‌గాంధీ, ఖర్గే లాంటివారికికూడా అధికారం లేదు. మెజారిటీ వచ్చినప్పుడు హైకమాండ్ అబ్జర్వర్‌ను పంపించి.. ఇక్కడి నేతల అభిప్రా యాలను తెలుసుకుంటుంది. ఆ తరువాతే ప్రకటిస్తుంది. ప్రాంతీయ పార్టీల్లో ఏమోగానీ.. జాతీయ పార్టీల్లో ఫలానా ఆయన రెండోసారి సీఎం అవుతారు అనేది ఎవరూ చెప్పరు. అలా చెప్పడానికి వీలు లేదు.
విజయక్రాంతి: చంద్రబాబు శిష్యుడిగా పేరుపడ్డ రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది.
రాజగోపాల్‌రెడ్డి: ఆరోజు ఉన్న పరిస్థితుల్లో.. 2014 తరువాత టీడీపీ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. సీఎం కావాలనే ఆయన కోరిక నెరవే ర్చుకునేందుకు.. టీడీపీలో ఉంటే సీఎం కాలేననే నమ్మకంతో.. కాంగ్రెస్ పార్టీలో ఉండే కొందరు పెద్దలను పట్టుకుని హైకమాండ్ దగ్గరికి వెళ్ళారు. పార్టీ లోకి వస్తే.. ఎవరు వద్దంటారు. ఎప్పటిలాగే పార్టీలో చేర్చుకున్నారు.
విజయక్రాంతి: చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపణలు వినపడుతున్నాయి.. దీనిపై మీరేమంటారు..?
రాజగోపాల్‌రెడ్డి: వందకు వంద శాతం అది నిజం. బయటకు రేవంత్‌రెడ్డి ఎంతగా మాట్లాడినా.. చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఇక్కడ పాలన కొనసాగుతోంది. ఆంధ్రా కాంట్రాక్టర్లు, ఆంధ్రా పెట్టుబడిదా రుల కంట్రోల్‌లోనే ఇక్కడి ప్రభుత్వం ఉంది. పాలసీలను వారే తయారుచేస్తున్నారు. వారు చెప్పినట్టే.. ఇక్కడ చాలా మంది అధికారులు వింటున్నారు. తెలంగాణలోని నిజమైన ఉద్యమకారులు, నిజమైన కాంగ్రెస్‌వాదులు, కాంగ్రెస్ పార్టీ.. వీరందరూ కనుమరుగైపోయి, చంద్రబాబు డైరెక్షన్‌లో ఆంధ్రా పాలకుల చేతుల్లోకి ఇన్ డైరెక్ట్‌గా పరిపాలన వెళ్ళిపో యింది.
విజయక్రాంతి: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మిగతా నాయకులెందకు నోరు మెదపడం లేదు..?
రాజగోపాల్‌రెడ్డి: చాలా మంది కాంగ్రెస్ నేతలు అంతర్మథనంలో ఉన్నారు. కొందరు నేతలు తమ స్వార్థం కోసం అడ్జస్ట్ అవుతున్నారు. నైతిక విలువలను మర్చిపోయారు. మరికొందరు ఏమీచేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. సమయం కోసం వేచి చూస్తున్నారు.
విజయక్రాంతి: అంటే.. రోజురోజుకూ రేవంత్‌రెడ్డి బలపడుతూ.. పార్టీని బలహీనం చేస్తున్నారా..?
రాజగోపాల్‌రెడ్డి: ఇదొక మైండ్ గేమ్.. రోజురోజుకూ ఆయన బలపడుతున్నారు. పార్టీని బలహీనం చేస్తున్నారు. ఆయనకు నాకు వ్యక్తిగతంగా శత్రుత్వం లేదు. ఆయన వ్యక్తిగతంగా బలపడవచ్చు. కానీ.. పార్టీని బలహీనం చేస్తూ, మా నాయకుడు రాహుల్‌గాంధీని బలహీనం చేస్తూ.. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం సరైంది కాదు.
విజయక్రాంతి: ఎన్నికలకు ముందు చాలా వాగ్దానాలు, హామీలు కాంగ్రెస్ పార్టీ చేసింది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ హామీలు అమలు చేస్తున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు వీటిపై..
రాజగోపాల్‌రెడ్డి: అప్పుడు చేసిన చాలా వాగ్దానాలు నెరవేర్చలేదని ప్రజలు అనుకుంటున్నారు. ఉచిత బస్సు, సన్నబియ్యం, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు.. లాంటివి మాత్రమే అమలు చేస్తు న్నారు. మిగతా అంశాలకు సంబంధించి.. పెన్షన్ పెంచడం, మహిళలకు రూ. 2500గానీ, నిరుద్యోగ భృతిగానీ లాంటివి చేయడం లేదని ప్రజల్లో ఉంది.
విజయక్రాంతి: మీకు మంత్రి పదవి విషయంలో ఆలస్యం ఎందుకు.. మీ సోదరుడిని సాకుగా చూపిస్తున్నారు ఎందుకు..?
రాజగోపాల్‌రెడ్డి: అప్పటి పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవడంలో భాగంగా.. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో నాకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి, తీసుకొచ్చారు. అప్పుడు మా సోదరుడు పార్టీలోనే ఉన్నారుగా. అప్పుడు గుర్తుకు రాలేదు.. ఒక్క ఇంటి నుంచి ఇద్దరు అవుతారేమోనని.. ఇప్పుడు కావాలనే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం చేస్తున్నారు.
అయినా నేను మంత్రి పదవి అడగడం లేదు. ఎప్పుడు చేస్తారనికూడా అడగడం లేదు. కానీ ఈ మాటలేంది. కాంగ్రెస్ పార్టీని మొత్తంగా నాశనంచేసేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. రేవంత్‌రెడ్డి చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం బలహీనపడుతోంది. అదే మా బాధ. అంతేగానీ.. మంత్రి పదవి కోసం కాదు. మంత్రి పదవి కాకపోతే.. రాబోయే కాలంలో సీఎం కావచ్చు. అది ఇక్కడి ప్రజల అభిమానం.. పార్టీ అధిష్ఠానం చేతుల్లో ఉంటుంది.
అవినీతి రహిత పాలన అందిస్తామని, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తామంటే.. నమ్ముతారు.. అందులోనూ తెలంగాణ ఉద్యమంలో ఉన్న మనుషులం కాబట్టి.. మాలాంటి వారికి అవకాశం వస్తది. కానీ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సం బంధంలేని, తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి.. అదృష్టం కొద్దీ సీఎం అయిన రేవంత్ లాంటి వ్యక్తి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా నీతులు చెప్పడం సరైంది కాదు.
విజయక్రాంతి: మంత్రి పదవి రాకపోవడంతో ఇలా అంటున్నారనే వాదనలుకూడా ఉన్నాయి..
రాజగోపాల్‌రెడ్డి: రేవంత్‌రెడ్డితో నేను మంచిగా ఉండి.. మస్కా కొట్టి నేను మంత్రి పదవి తీసుకోవచ్చు. అలా తీసుకోవాలనుకోవడం లేదు. ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇస్తే తీసుకుంటా. ఇవ్వకపోయినా.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, పార్టీ కార్యకర్తగా పనిచేస్తా. అంతేగానీ.. కాంగ్రెస్ పార్టీకి, ప్రజాస్వామ్యవాదులకు, పార్టీ పెద్దలకు నాయకులకు నష్టం చేసేలా అహంకారపూరితంగా తెలంగాణకు, ప్రజలకు నష్టం కలిగించేలా మాట్లాడటం సరైంది కాదు.
దీనిని అధిష్ఠానం దృష్టికి తీసుకెళతా. హామీ ఇచ్చినమేరకు ఐదుగురం పార్టీలోకి వచ్చాం. వారికి మంత్రి పదవులు ఇచ్చారు. హామీ ఇచ్చి.. పొంగులేటి, తుమ్మల, కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావులకు తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చారు. అప్పుడే హామీ ఇచ్చి నన్ను తీసుకొచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత హామీ నిలుపుకోవడం లేదు. అయినా ఫరవాలేదు. బిచ్చగాడిని కాదు. నేను రాష్ట్రం కోసం, ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని.
నేను డబ్బు కోసం, పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు, పేదవారికి అండగా ఉండేందుకు రాజకీయాల్లోకి వచ్చాను. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే రాజకీయాల్లోకి వచ్చాను. డబ్బు కోసమే అయితే బిజినెస్‌లోనే ఉండేవాడిని. వ్యాపారం వదిలి వచ్చిందే తెలంగాణ ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలోని పేదలకు అండగా ఉండాలని వచ్చాను.
రైతులు, యువతను కాపాడుకోవాలి. లక్షలాది కుటుంబాలు మద్యానికి బానిసవుతున్నారు. అందుకే మద్యాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నా. అప్పట్లో కేసీఆర్ పాలనలోనూ ఆంధ్రా కాంట్రాక్టర్లు, ఆంధ్రా పెట్టుబడి దారులు దోచుకున్నారు. ఇప్పుడుకూడా ఈయన వచ్చిన తరువాత మళ్ళీ వారిదే కొనసాగుతోంది.
విజయక్రాంతి: ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి కాంట్రాక్టర్లకు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా మాట్లాడారు కదా..
రాజగోపాల్‌రెడ్డి: రేవంత్‌రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఓఆర్‌ఆర్ పెద్ద స్కాం అన్నాడు. అమ్ముకున్నారని అన్నాడు. ప్రభుత్వం వచ్చిన తరువాత క్యాన్సల్ చేస్తానని అన్నారు. అసెంబ్లీలోనూ మాట్లాడుతూ.. సిట్ వేసి విచారించి జైల్లో పెడతామన్నారు. ఏదీ సిట్?ఎక్కడ జైలు..? కాళేశ్వరం ఫైలు ఎక్కడికి పోయింది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమయ్యింది? ఎన్నో స్కాములు బీఆర్‌ఎస్ హయాంలో జరిగాయి. అవన్నీ ఏమయ్యాయి? విచారణలు లేవు.. ఏం లేవు. ఎందరిని అరెస్టు చేసి జైలుకు పంపారు? ఇదంతా డ్రామా.