18 March, 2026 | 2:47 AM

5 నెలల గర్భిణిని చంపిన భర్త

18-03-2026 01:22 AM

కోరుట్ల రూరల్, మార్చి 17 (విజయక్రాంతి): దంపతుల మధ్య జరిగిన చిన్న గొడవకు కోపోద్రిక్తుడైన భర్త.. 5 నెలల గర్భిణి అని కూడా చూడకుండా కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌లో జరిగింది. కోరుట్ల మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి (21), కోరుట్ల పట్టణానికి చెందిన చిత్తారి హరిబాబు 8 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి హరిబాబు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో వైష్ణవి స్వగ్రామమైన మాదాపూర్‌లోనే అత్తగారింటి వద్ద ఉంటున్నారు. వైష్ణవి ప్రస్తుతం 4 నెలల గర్భిణి.

వీరు ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నారు. కాగా మంగళవారం తెల్లవారుజామున ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ పెరిగి వైష్ణవి పై దాడికి దారితీసింది. ఈ క్రమంలో వైష్ణవిపై కత్తితో హరిబాబు దాడి చేసి, గోడకు బాదడంతో తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. హరిబాబు పరారీలో ఉన్నాడు. హరిబాబును కఠినంగా శిక్షించాలని కోరుతూ మృతురాలి బంధువులు కోరుట్ల ప్రభుత్వాసుపత్రి వద్ద పెద్ద ఎత్తున ఆందోళన దిగారు.