‘వందేమాతరం’ ఉల్లంఘనపై చర్యలేవి?
స్పీకర్‌ను నిలదీసిన కేంద్రమంత్రి బండి సంజయ్
హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): ‘స్పీకర్ గారు మజ్లిస్ నేతల ‘వందే మాతరం’ ఉల్లంఘనపై చర్యలేవి. మీరు రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నారనే విషయం మర్చిపోయారా’ అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. అసెంబ్లీ వేదికగా మజ్లిస్ నేతలు వందేమాతరం గేయాన్ని అవమానిస్తే ప్రేక్షక పాత్ర వహించడమేంటి? అని ఆయన నిలదీశారు. గవర్నర్, స్పీకర్, మండలి చైర్మన్ సాక్షిగా మజ్లిస్ నేతలు వందేమాతరం గేయాన్ని అవమానించినా పట్టదా అంటూ మంగళవారం ప్రకటనను విడుదల చేశారు.
రాష్ట్రపతి, గవర్నర్ అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం తప్పనిసరి చేస్తూ 2026లోనే కేంద్రం ఉత్తర్వులిచ్చిన విషయం మర్చిపోయారా అని పేర్కొన్నారు. వందేమాతరం గేయ ఆలాపాన సమయంలో అసెంబ్లీ నుండి వాకౌట్ చేసిన మజ్లిస్ నేతలకు ఇంతవరకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ దోస్త్ కాబట్టి నోటీసులివ్వడానికి భయపడుతున్నారా అంటూ అనుమానం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో స్పీకర్ ఇచ్చిన తీర్పుతో శాసన వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సడలిందని, స్పీకర్ సాక్షిగా నిండు సభలోనే మజ్లిస్ ఎమ్మెల్యేలు వందేమాతరం అవమానించినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాజ్యాంగానికి అనుగుణంగా ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలనే సోయి ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు.




