16 March, 2026 | 2:07 AM

అనుమానంతో భార్యను చంపిన భర్త

10-11-2025 12:00 AM
  1. బ్యాట్‌తో కొట్టి హత్య 
  2. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఘటన

అమీన్‌పూర్, నవంబర్ 9: అనుమానంతో భార్యను భర్త హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఆదివారం జరిగింది. పట్టణంలోని కేఎస్‌ఆర్ కాలనీలో నివాసముండే కృష్ణవేణి, బ్రహ్మయ్య భార్యాభర్తలు. కృష్ణవేణి కోహిర్ డీసీసీబీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తుంది. బ్రహ్మయ్య సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు ఇంటర్, కుమారుడు ఎనిమిదో తరగతి చదువుతున్నారు.

అయితే కొన్ని రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కృష్ణవేణికి వివాహేతర సంబంధం ఉన్నదనే అనుమానంతో బ్రహ్మయ్య తరచూ వాగ్వాదానికి దిగేవాడని స్థానికులు చెపుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన బ్రహ్మయ్య ఇంట్లో ఉన్న బ్యాట్‌తో కృష్ణవేణిపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఆ తర్వాత బ్రహ్మయ్య పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు.