7 July, 2026 | 2:11 AM

పెట్టుబడుల గమ్యస్థానం హైదరాబాద్

07-07-2026 01:15 AM
  1. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  2. హైదరాబాద్ సమ్మిట్‌లో విదేశీ ప్రతినిధులతో ఆత్మీయ విందు
  3. నేడు, రేపు గ్రీన్ గ్రోత్ ఎనర్జీ సమ్మిట్ 

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా, సాంకేతికం గా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, పెట్టుబడులకు హైదరాబాద్ అత్యంత సురక్షితమైన, అనువైన గమ్యస్థానమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైటెక్స్ నోవాటెల్‌లో గ్రీన్ గ్రోత్ ఎనర్జీ సమ్మిట్ -2026 మంగళ, బుధవారాల్లో నిర్వహిస్తున్న సందర్భంగా సోమవారం రాత్రి వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు స్వాగతం, ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో వారితో కలిసి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందుతోందని, ఇక్కడ పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నగరంలో విద్యుత్, నీరు వంటి మౌలిక వసతులకు ఎటువంటి కొరత లేదని, ఎస్టాబ్లిష్మెంట్స్ ఏర్పాటుకు ఇది స్వర్గధామం వంటిదని పేర్కొన్నారు.

ప్రపంచంలోని దిగ్గజ సంస్థలన్నీ ఇప్పుడు హైదరాబాద్ను తమ గ్లోబల్ సెంటర్లకు మరియు డేటా సెంటర్లకు ప్రధాన వేదికగా ఎంచుకుంటున్నాయని ఆయన వెల్లడించారు. అతిథులకు సేవ చేయడంలో, వారిని సాదరంగా ఆహ్వానించడంలో తెలంగాణ ప్రజలు ముందుంటారని, ఇది మా సంప్రదాయమని ఆయన అభివర్ణించారు.

గ్రీన్ ఎనర్జీ సమ్మిట్‌కు వచ్చిన ప్రతినిధులకు నగరంపై ఉన్న అభిప్రాయాలను తెలుసుకున్న డిప్యూటీ సీఎం, వారి పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. నిర్వాహకురా లు రిత్విక బట్టా చార్య ఈ సమ్మిట్‌కు వివిధ దేశాల నుంచి హాజరైన ప్రతినిధులను ఉప ముఖ్యమంత్రి కి పరిచయం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు, ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉన్నారు.