7 July, 2026 | 2:11 AM

ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

07-07-2026 01:15 AM

వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

హనుమకొండ, జూలై 6 (విజయక్రాంతి): పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి ప్రజలకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఆదేశించారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోమవారం ఆమె తొలిసారిగా హనుమకొండ పోలీస్ స్టేషన్ను సందర్శించారు.

అనంతరం వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను తనిఖీ చేసి, వాటి స్వాధీనానికి గల కారణాలు, కేసుల పురోగతి గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసు నమోదులు, ఇతర పరిపాలనా అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది వివరాలను తెలుసుకుని, వారి విధి నిర్వహణపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పోలీసులు ప్రజల సేవకులనే భావనతో విధులు నిర్వహించాల్సిన బాధ్యత ఉందన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అందిన ప్రతి ఫిర్యాదును వెంటనే నమోదు చేసి రసీదు అందజేయాలని సూచించారు. ఈ తనిఖీలో సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, ఏసీపీలు నర్సింహరావు, సత్యనారాయణ, హనుమకొండ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.