11 April, 2026 | 4:10 AM

అభివృద్ధిలో హైదరాబాద్ హైస్పీడ్

11-04-2026 02:04 AM
  1. నగరంలో మౌలిక సదుపాయాలపై కేంద్రం దృష్టి
  2. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు కృషి
  3. త్వరలో కొమురవెల్లి రైల్వే స్టేషన్ భక్తులకు అంకితం
  4. యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ పరిశీలన
  5. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): హైదరాబాద్ ఒక స్టేట్ క్యాపిటల్‌గా దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దీనికి అవసరమైన తాగునీటి సమస్యల పరిష్కారం, రోడ్డు కనెక్టివిటీ, మౌలిక సదుపా యాల అభివృద్ధి, మహిళా సంక్షేమం వంటి అన్ని అంశాలపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్డే మీల్స్, టెక్ట్స్‌బుక్స్, యూనిఫార మ్స్, అలాగే స్మార్ట్ క్లాసులు, డిజిటల్ క్లాసులు వంటి సదుపాయాలను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. శుక్రవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్డీలో హైదరాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం నిర్వహించారు.

అనంతరం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లోని ఆసుపత్రుల్లో డయాలిసిస్ సెంటర్లు, వ్యాక్సినేషన్ సదుపాయాలు, ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సమ్మర్ నేపథ్యంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశా మని, జీహెచ్‌ఎంసీ, మెట్రో వాటర్, ఎడ్యుకేషన్ శాఖలు కలిసి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. నగర అభివృద్ధి కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దడానికి కట్టు బడి ఉన్నామని స్పష్టం చేశారు.

కేంద్ర నిధుల ద్వారా హైదరాబాద్ నగర అభివృద్ధికి అనేక ప్రాజెక్టులు తీసుకొస్తున్నామని, హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పుణే నగరాలకు హైస్పీడ్ రైలు, ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమవు తున్నాయని, ఇవి తెలంగాణ అభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా మారనున్నాయని వెల్లడించారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రకారం ప్రపోజల్స్ పంపిస్తే, ఆ పథకాలను కేంద్రం ఆమోదిస్తుందని తెలిపారు. అనవసరమైన విమర్శలు చేయడం కాకుండా, కేంద్ర పథకాలను సమర్థంగా అమలు చేస్తేనే ప్రజలకు నిజమైన లబ్ధి జరుగుతుందన్నారు. 

కొమురవెల్లి రైల్వే స్టేషన్ ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ అని, ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో ఈ నిర్మాణ పనులు పూర్తవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రధాని మోదీ ఈ రైల్వే స్టేషన్‌ను మల్లన్న స్వామి భక్తులకు అంకితం చేస్తారని, హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ ట్రైన్ సదుపాయం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని, రూ.500 కోట్లు మంజూరు చేసే ప్రతిపాదన ఉందని, దీనిపై ప్రధానితో మాట్లాడి, త్వరలోనే అమలు దిశగా ముందు కు తీసుకెళ్తామన్నారు.