19 June, 2026 | 1:34 AM

రైతులకు తప్పని యాప్ కష్టాలు

19-06-2026 12:00 AM

బూర్గుపల్లి కృష్ణ యాదవ్ :

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముక. రైతు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొత్త విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాలను ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలో ఎరువుల పంపిణీలో పారదర్శకత తీసుకురావడం, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడమే లక్ష్యంగా యూరియా విక్రయాలను డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నారు. యాప్‌లో రైతుల వివరాలను నమోదు చేసి యూరియా విక్రయాలు చేపడుతున్నారు.

అయితే ఈ విధానం లక్ష్యం మంచిదైనా నిరక్షరాస్య రైతులకు మాత్రం అనేక ఇబ్బందులను తెచ్చిపెడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాం తాల్లో చాలా మంది రైతులు నిరక్ష్యరాస్యులే. అలాంటి రైతులకు స్మార్ట్‌ఫోన్ వినియోగం, యాప్ నిర్వహణ, డిజిటల్ లావాదేవీలు వంటి అంశాలు కొత్తగా, క్లిష్టంగా మారాయి. యూరియా కొనుగోలు సమయంలో ఆధా ర్ నంబర్ నమోదు చేయడం, మొబైల్ నం బర్ ధ్రువీకరణ, యాప్‌లో వివరాలు నమో దు చేయడం వంటి ప్రక్రియలు వారికి సవాలుగా మారుతున్నాయి.

ప్రస్తుతం చాలా గ్రామాల్లో రైతులు యూరియా కొనుగోలు కోసం ఎరువుల దుకాణాలకు వెళ్లినప్పుడు యాప్‌లో నమో దు తప్పనిసరి అవుతోంది. యాప్ సక్రమం గా పనిచేయకపోతే లేదా ఇంటర్నెట్ సమస్యలు ఎదురైతే రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. వ్యవసాయ పనులు సీజన్‌కు అనుగుణంగా సమయానికి జరగాలి. విత్తనాలు వేసిన తర్వాత లేదా పంట ఎదుగుదల దశలో యూరియా అందుబాటులో లేకపోతే దిగుబడిపై ప్రభావం పడు తుంది. ఇలాంటి పరిస్థితుల్లో యాప్ సాంకేతిక సమస్యలు రైతులకు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

రైతులలో చాలామందికి స్మార్ట్‌ఫోన్లు కూ డా లేవు. ఉన్నవారిలో చాలామంది కేవలం ఫోన్ కాల్స్ చేయడానికి ఉపయోగిస్తారు. యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం, ఓపెన్ చేయ డం, అవసరమైన వివరాలు నమోదు చేయ డం వంటి పనులు వారికి తెలియవు. దీంతో వారు ఇతరుల సహాయం కోరాల్సి వస్తోం ది. కొన్నిసార్లు మధ్యవర్తులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనివల్ల రైతుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమయ్యే ప్రమాదం కూడా ఉంది.

వృద్ధ రైతుల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. జీవితాంతం సంప్రదాయ వ్యవసా యం చేసిన వారు ఒక్కసారిగా డిజిటల్ వ్య  వస్థలకు అలవాటు పడలేరు. వయస్సు కారణంగా కొత్త సాంకేతికతను నేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రభుత్వం రైతులకు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన యాప్ వారికి భారంగా మా రింది.

అయితే యూరియా యాప్ వల్ల కొన్ని సానుకూలతలు కూడా ఉన్నాయి. ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరిగింది. నిజమైన రైతులకు మాత్రమే యూరియా అందే అవకాశం ఉంటుంది. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ విక్రయాలను కొంతవరకు నియంత్రించవచ్చు. రైతుల కొనుగోలు వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కావడం వల్ల భవిష్యత్తులో పథకాల అమలుకు కూడా ఉపయోగపడుతుంది. కానీ, ఈ ప్రయోజనాలు రైతులందరికీ చేరాలంటే వ్యవస్థ మరింత సులభంగా ఉండాలి.

ప్రభుత్వం యాప్‌ను ప్రవేశపెట్టడమే కాకుండా రైతులకు అవసరమైన శిక్షణ కూ డా అందించాలి. గ్రామ స్థాయిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యా ప్ వినియోగంపై రైతులకు మరింతగా శిక్షణ ఇవ్వాలి. వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతు వేదికలు, వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా రైతులకు శిక్షణలో తోడ్పడాలి. ప్రతి గ్రామంలో డిజిటల్ సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఉచిత సహాయం అందించాలి.

అలాగే యాప్‌తో పాటు ప్రత్యామ్నాయ విధానాన్ని కూడా కొనసాగించడం అవసరం. సాంకేతిక సమస్యలు ఎదురైనప్పుడు రైతులు ఇబ్బంది పడకుండా ఆఫ్‌లైన్ విధానంలో కూడా యూరియా కొనుగోలు చేసే అవకాశం కల్పించాలి. ముఖ్యంగా వృద్ధులు, నిరక్షరాస్యులు, స్మార్ట్‌ఫోన్ లేని రైతులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. రైతు ఆధార్‌కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాల ఆధారం గా ఎరువులు పొందే వెసులుబాటు ఉండాలి.

డిజిటల్ ఇండియా లక్ష్యాల సాధనలో భాగంగా వ్యవసాయ రంగంలో సాంకేతికతను ప్రోత్సహించడం అవసరమే. కానీ, సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు సౌలభ్యం కల్పించాలి తప్ప, ఇబ్బందులకు కారణం కాకూడదు. గ్రామీణ వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని విధానాలను రూ పొందించాలి. ముఖ్యంగా నిరక్షరాస్య రైతుల సమస్యలను అర్థం చేసుకుని వారికి అనుకూలంగా వ్యవస్థను సరళీకృతం చేయాలి.

వ్యవసాయ శాఖ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి, రైతలకు ఎంత వ్యవసాయ భూమి ఉంది? వారికి ఎంత యూరి యా అవసరం? ఏయే పంటలు వేయదలుచుకున్నారు? లాంటి వివరాలన్నీ సేకరించా లి. తద్వారా దళారి వ్యవస్థకు స్వస్తిపలికి ఆ యా గ్రామాలకు కావలసిన నాణ్యమైన విత్తనాలను, యూరియాను ప్రభుత్వం ద్వారా, గుర్తింపు పొందిన ఎరువుల దుకాణ యజమానుల ద్వారా నేరుగా రైతు ఇంటికే అం దించాలి. అలా చేస్తే ఎలాంటి గందరగోళం ఉండదు. యాప్ కంటే ఇది మేలైన మార్గం అవుతుంది.

 వ్యాసకర్త సెల్: 9866170384