13-03-2025 01:51:58 AM
హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): తెలంగాణకు హైదరాబాద్ తలమానికమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఐటీ, పరిశ్రమలశాఖ సంవత్సర కాలంగా రకరకాల సమ్మిట్‌లు నిర్వహించి భారీగా పెట్టుబడులు సాధించ డంతో పాటు రాష్ట్ర ప్రతిష్ఠను పెంచిందన్నారు.
బుధవారం ప్రజాభవన్‌లో ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఇంధన శాఖలకు సంబంధించిన ప్రీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి డిప్యూటీ సీఎం ఈ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణ బాధ్యతలు కార్పొరేట్ సంస్థలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇందుకోసం ఒక్కో కార్పొరేట్ కంపెనీకి సీఎస్‌ఆర్ నిధులను అప్పగించాలని పరిశ్రమల శాఖ అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. భారీ పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాకాలను దశలవారీగా విడుదల చేస్తామని తెలిపారు. రాష్ర్టంలో మెగా లెదర్ పార్కులు, మినీ లెదర్ పార్కుల ప్రగతిని సమీక్షించారు.
లెదర్ పార్కులకు కేటాయించిన స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా కాపాడాలని అధికారులను ఆదేశించారు. మూడో శ్రేణి పట్ట ణాలకు ఐటీ టవర్లను విస్తరించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి, ప్రస్తుతం కొనసాగుతున్న పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు.
రియల్ ఎస్టేట్ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు చేపట్టాలని తెలిపారు. కరెంటు సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. సమావేశాల్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, జయేష్ రంజన్, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, పరిశ్రమల శాఖ అధికారులు విష్ణువర్ధన్ రెడ్డి, మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.