మెట్రో @50 కోట్ల మంది
50 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చిన హైదరాబాద్ మెట్రో
నేడు అమీర్‌పేట స్టేషన్‌లో వేడుకలు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 2 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రో రైలు కీలక మైలురాయిని దాటింది. 2017 నవంబర్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు 50 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. ఈ సందర్భంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో మెట్రో రైల్ లిమిటెడ్, ఎల్&టీ సంయుక్తంగా వేడుకలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమా నికి మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్‌అండ్‌టీ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి హాజరవు తారని గురువారం ఒక ప్రకటనలో మెట్రో అధికారులు తెలిపారు.
హైదరాబాద్ మెట్రో రైలును 2017 నవంబరు 28న నాగోల్ మార్గాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించగా నవంబర్ 29 నుంచి సేవలు ప్రారంభించారు. మెట్రోరైలు ప్రారంభించిన మొదటిరోజే 2 లక్షల మంది ప్రయాణించగా.. ప్రస్తుతం రోజుకు 4.50 లక్షల నుంచి 4.80 లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నట్లు మెట్రోవర్గాలు తెలిపాయి. మెట్రో రెండో దశ ఎల్బీనగర్ మార్గాన్ని 2018 అక్టోబర్, మూడో దశ అమీర్‌పేట మార్గాన్ని 2019 మార్చిలో ప్రారంభించారు. 2020 ఫిబ్రవరి 7 నుంచి జేబీఎస్ మార్గం అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ మెట్రో దేశంలో 2వ అతిపెద్ద మెట్రోగా సేవలు అందిస్తోంది.




