పరిహారం చెల్లింపులో పరిహాసం
గతేడాది 12,265 ఎకరాల్లో పంట నష్టం
పరిహారం ఇచ్చింది కేవలం 88 ఎకరాలకే
మెదక్ జిల్లా రైతులకు తప్పని ఎదురుచూపులు
మెదక్, మే 2 (విజయక్రాంతి): పంట నష్ట పరిహారం పరిహాసంగా మారింది. గతేడాది యాసంగిలో కురిసిన అకాల వర్షాలకు మెదక్ జిల్లా వ్యాప్తంగా 12,265 ఎకరాల్లో పంట దెబ్బతినగా పరిహారం మాత్రం కేవలం 88 ఎకరాలకు మాత్రమే అందింది. నష్టం కొండంత జరిగితే పరిహారం గోరంత ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. మరోవైపు, మార్చి లో కురిసిన అకాల వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 714 ఎకరాల్లో పంట దెబ్బతినగా పరిహారం కోసం రైతులకు ఎదు రుచూస్తున్నారు. కాగా, ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పి సంబంధిత అధికారులతో సర్వే చేయించినా నిధుల విడు దలలో మాత్రం అలసత్వం వహిస్తుంది. 12,265 ఎకరాలకు గాను రూ. 12,26,50,000 పరిహారం రైతులకు చెల్లించాల్సి ఉండగా కేవలం 88 ఎకరాలకు మాత్రమే ఎకరాకు రూ.10వేల చొప్పున రూ.8.80 లక్షలు చెల్లించి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఇంకా 12,177 ఎకరాలకు రూ. 12,17,70,000 చెల్లించాల్సి ఉంది.
పరిహారం కోసం తప్పని నిరీక్షణ
దుక్కిదున్నడం మొదలుకొని ఎరు వు బస్తాలు, విత్తనాలు, వరినాట్లు వేసేందుకు గాను ఎకరా పంటకు మొత్తం రూ.18 వేల వరకు ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. అయితే, ప్రభు త్వం ఎకరాకు రూ.10 వేల పరిహారం ప్రకటించడం ద్వారా తమకు పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. అంతేకాదు, ప్రభుత్వం ఇస్తామన్న నష్ట పరిహారం కూడా చెల్లించడంలేదని ఆందోళన అన్నదాతలు చెందుతున్నారు.
ఈ ఏడాది 714 ఎకరాల్లో పంటనష్టం
గత మార్చి నెలలో కురిసిన వడగండ్ల వానకు జిల్లాలోని నిజాంపేట, రామాయంపేట, చేగుంట, చిన్నశంకరంపేట మండలాల పరిధిలో 714 ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నష్టం జరిగింది. ఇందులో ప్రధానంగా నిజాంపేట మండలంలో అత్యధికంగా పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. కాగా ఇందుకు సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపించారు. గతేడాది పరిహారమే ఇప్పటికే రాలేదని, ఈ ఏడాది పరిహారం ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టత లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.




