18-07-2025 03:02:09 PM
హైదరాబాద్: బతుకమ్మ కుంట(Bathukamma Kunta Cheruvu) వద్ద హైడ్రా తొలి వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, కాంగ్రెస్ నేత వీహెచ్ పాల్గొన్నారు. బతుకమ్మకుంట చుట్టూ విద్యార్థుల మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషన్ రంగనాథ్ మాట్లాడుతూ... సెప్టెంబర్ లో బతుకమ్మ కుంట నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ సంబరాలు ప్రారంభిస్తారని హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) పేర్కొన్నారు. ఏడాదిలో హైడ్రాకు మంచి, చెడు అనుభవాలు ఎదురయ్యాయని రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విపత్తుల నిర్వహణకు సంబంధించి ప్రణాళికతో పనిచేస్తోందని రంగనాథ్ స్పష్టం చేశారు. ఏడాదిలో 500 ఎకరాల ప్రభుత్వ స్థలాలు పరిరక్షించామని వెల్లడించారు.
రూ. 30 వేల కోట్ల విలువైన స్థలాలను హైడ్రా పరిరక్షించిందని తెలిపారు. ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు, నాలాలను పరిరక్షిస్తున్నామని తెలిపారు. కూల్చడమే కాదు నిర్మాణం చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష అని రంగనాథ్ వివరించారు. హైడ్రా(Hyderabad Metropolitan Development Authority) రాక ముందు నిర్మించుకున్న ఇళ్లకు మినహాయింపు ఇచ్చామని తెలిపారు. ఆక్రమణల వెనుక చాలా మంది పెద్దవాళ్లు ఉంటారని ఆరోపించారు. వాళ్లు తప్పించుకోవడానికి పేదలను బుల్‌డోజర్ల ముందు పెడుతున్నారని మండిపడ్డారు. పేదవాళ్లపై హైడ్రా పగపట్టిందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని చెప్పారు. రూ. 40 కోట్ల పార్కు స్థలాన్ని ఆక్రమించే ధైర్యం పేదవాళ్లకు ఉంటుందా? అని రంగనాథ్ ప్రశ్నించారు. మూసీనదికి సంబంధం లేకున్నా హైడ్రాకు ముడి పెట్టారని ధ్వజమెత్తారు. ఓవైసీ కళాశాల విషయంలో మా నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పామన్న ఆయన ఓవైసీ కళాశాల 2015-16 లో నిర్మించారని కమిషన్ రంగనాథ్ తెలిపారు. ఓవైసీ కళాశాల ఉన్న చెరువు ప్రాంతానికి 2016లో నోటిఫికేషన్ ఇచ్చారని వెల్లడించారు. సల్కం చెరువునకు తుది నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదని వివరించారు. ఓవైసీ కళాశాలపైనే పదేపదే ఎందుకు ప్రశ్నిస్తున్నారు. నగరంలోని 80 శాతం చెరువులకు తుది నోటిఫికేషన్ ఇవ్వలేదని తెలిపారు