08-08-2025 12:01:49 PM
గుజరాత్ నుంచి జిల్లాకు చేరుకున్న బ్యాలెట్ బాక్సులు
మంచిర్యాల: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల(local body elections) ఏర్పాటు పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వాహణ కోసం గుజరాత్ రాష్ట్రం నుంచి బ్యాలెట్ బాక్సులను కేటాయించి వాటిని వెంటనే తెప్పించుకోవాలని జడ్పీ సీఈఓ, డీపీఓలకు పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ శ్రీజన ఉత్తర్వులు జారీ చేశారు.
పోలీసు బందోబస్తు నడుమ జిల్లాకు బ్యాలెట్ బాక్సులు..
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు గుజరాత్ రాష్ట్రంలోని జాంనగర్ కలెక్టర్, ద్వారక జిల్లా (దేవభూమి) కంబలియా డిప్యూటీ కలెక్టర్ లను కలిసి ఆయా జిల్లాల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల కోసం బ్యాలెట్ బాక్సులను సేకరించుకుని పోలీసు బందోబస్తు నడుమ జిల్లాకు బ్యాలెట్ బాక్సులు గురువారం చేరుకున్నాయి.
జిల్లాకు 970 బ్యాలెట్ బాక్సులు..
జిల్లాకు బ్యాలెట్ బాక్సులు తీసుకువచ్చేందుకు బృంద సభ్యులు (మండల పంచాయతీ అధికారులు అజ్మత్ అలీ, శ్రీపతి బాపు రావు, పంచాయతీ కార్యదర్శి సుమన్, డిపిఎం నరేందర్) దాదాపు 3,200 కిలో మీటర్లు ప్రయాణించి 970 బ్యాలెట్ బాక్సులను పోలీస్ సిబ్బంది బందోబస్తు నడుమ తీసుకువచ్చారు. బృంద సభ్యులను ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం అభినందించారు.
బ్యాలెట్ బాక్సులను పరిశీలించిన అధికారులు..
గుజరాత్ రాష్ట్రం నుంచి జిల్లా కలెక్టర్ కు వచ్చిన బ్యాలెట్ బాక్సుల లారీని కలెక్టరేట్ ఏఓ పిన్న రాజేశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, బెల్లంపల్లి డివిజనల్ పంచాయతీ అధికారి షేక్ సర్దార్ అలీ పరిశీలించారు. అనంతరం బ్యాలెట్ బాక్స్ లను మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ సి.ఐ.ఎస్.ఎఫ్. క్వాటర్లలో పోలీసు బందోబస్తు మధ్య భద్రపరిచారు.