18-02-2026 12:10:45 AM
హైకోర్టు ఆదేశాలతో నిలిచిన ఎన్నిక
అబ్దుల్లాపూర్‌మెట్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రణరంగంగా మారింది. పోలింగ్ కేంద్రంలో తోపులాటలు, కోర్టు స్టేలు, కౌన్సిలర్ కిడ్నాప్ డ్రామాల మధ్య మంగళవారం నాటి ఎన్నిక అత్యంత ఉత్కంఠగా సాగింది. బీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం సాధించినట్లు కనిపించినా, చివరి నిమిషంలో హైకోర్టు ఆదేశాలతో ప్రక్రియ నిలిచిపోయింది. మున్సిపల్ కార్యాలయం ఇరు వర్గాల నినాదాలతో హోరెత్తింది. ఓటింగ్ విధానంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చేతులెత్తి ఓటు వేయాలని అధికారులు సూచించగా, బ్యాలె ట్ పేపర్ కావాలని కాంగ్రెస్ పట్టుబట్టింది.
పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి కౌన్సిలర్లను సముదాయించాల్సి వచ్చింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్యే రిటర్నింగ్ అధికారి ఓటింగ్ నిర్వహించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి టేకుల సుదర్శన్‌రెడ్డికి 15 ఓట్లు రావడంతో ఆయన విజయం ఖాయమైంది. పమాణ స్వీకారం కూడా పూర్తయింది. హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ రావడంతో అధికారులు ప్రకటనను నిలిపివేశారు. 19న కోర్టు ఇచ్చే తీర్పుపైనే ఇబ్రహీంపట్నంమున్సిపల్ పీఠం భవిష్యత్తు ఆధార పడి ఉంది.
యాదగిరి మిస్టరీ.. అనూహ్య ఎంట్రీ!
ఈ ఎన్నికలో ప్రధాన మలుపు కౌన్సిలర్ యాదగిరి అదృశ్యం. ఆయన కిడ్నాప్ అయ్యారంటూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సాగుతుండగానే యాదగిరి అకస్మాత్తుగా కౌన్సిల్ హాల్‌లో ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయినప్పటికీ, ఈ వ్యవహారంపై కోర్టు స్టే విధించింది.