త్వరలో హ్యుందాయ్ భారీ ఐపీవో
3 బిలియన్ డాలర్ల సమీకరణ లక్ష్యం
న్యూఢిల్లీ, జూన్ 14: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ తన సబ్సిడరీ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్‌ను భారతీయ స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్ చేసేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో దేశంలో భారీ భారీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) జారీ కోసం త్వరలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను సమర్పించనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడిం చాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియాకు 18 బిలియన్ డాలర్ల విలువ కడుతూ అందులో 17 శాతం మేర వాటా ను హ్యుందాయ్ విక్రయించాలన్నది ప్రతిపాదన అని, ఐపీవో ద్వారా 3 బిలియన్ డాలర్ల వరకూ (రూ.25,050 కోట్లు) సమీకరించాలన్నది లక్ష్యమని ఆ వర్గాలు తెలిపాయి.
ఈ ఆఫర్‌కు కొటక్ మహీంద్రా క్యాపిటల్, మోర్గాన్‌స్టాన్లీలను అడ్వయిజర్లుగా ఖరారు చేసింది. ఇప్పటివరకూ భారత్‌లో ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) జారీచేసిందే అతిపెద్ద ఐపీవో. 2022 మే నెలలో ఎల్‌ఐసీ పబ్లిక్ ఆఫర్ ద్వారా 2.7 బిలియన్ డాలర్లు సమీకరించింది. హ్యుందాయ్ మోటార్ ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి జూన్ నెలాకరు లేదా జూలై ప్రధమార్థంలో సమర్పిస్తారని సంబంధిత వ్యక్తులు తెలిపారు.






