10 June, 2026 | 10:09 PM

రైతులకు హ్యుందాయ్ 'అయానిక్ ఫారెస్ట్' అవగాహన

10-06-2026 09:03 PM

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ కు చెందిన కార్పొరేట్ సామాజిక బాధ్యత విభాగం 'హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫౌండేషన్' ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. తమ ప్రతిష్టాత్మక 'హ్యుందాయ్ అయానిక్ ఫారెస్ట్' కార్యక్రమంలో భాగంగా, సుస్థిర వ్యవసాయం మరియు పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేందుకు ఈ రైతు సదస్సును ఏర్పాటు చేసింది.

ఈ పథకం కింద లబ్ధి పొందుతున్న మొత్తం 290 మంది రైతుల్లో సుమారు 60 మంది ఈ సదస్సులో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పలు కీలక అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. పంటల నిర్వహణ, పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులపై ఆచరణాత్మకమైన సమాచారాన్ని అందించేందుకు 'అవగాహన వర్క్‌షాప్'ను నిర్వహించారు.

కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని, పరస్పర విజ్ఞాన బదిలీని బలోపేతం చేసే లక్ష్యంతో 'రైతులతో ముఖాముఖి' ఏర్పాటు చేశారు. అలాగే, పచ్చదనాన్ని పెంపొందించడంలో రైతుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ 'మొక్కలు నాటే కార్యక్రమాన్ని' చేపట్టారు. దీర్ఘకాలిక పర్యావరణ సుస్థిరత కోసం చేస్తున్న ఈ సమిష్టి కృషీలో స్థానిక జిల్లా అధికారులు సైతం పాలుపంచుకున్నారు.

హ్యుందాయ్ 'అయానిక్ ఫారెస్ట్' కార్యక్రమం భారతదేశవ్యాప్తంగా పర్యావరణంపై సానుకూల ప్రభావం చూపుతూ భారీ స్థాయిలో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా.. తమిళనాడులోని కాంచీపురంలో 12.16 ఎకరాల విస్తీర్ణంలో 5,750 మొక్కలతో ఒక జీవవైవిధ్య పునరుద్ధరణ కేంద్రాన్ని అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రైతుల జీవనోపాధికి తోడ్పడేలా 650 ఎకరాల్లో 42,000 కు పైగా మొక్కలతో 'వ్యవసాయ అటవీకరణ’ కార్యక్రమాలను అమలు చేశారు.

అలాగే పుణెలో 90.5 ఎకరాల్లో 10 లక్షలకు పైగా మొక్కలతో మియావాకి విధానంలో ఒక భారీ పట్టణ అడవిని నిర్మించారు. ఈ కార్యక్రమాలన్నింటి ద్వారా దేశవ్యాప్తంగా పది లక్షల మొక్కలు నాటాలనే మైలురాయిని సంస్థ విజయవంతంగా అధిగమించింది.రైతుల కోసం ప్రత్యేకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా.. గ్రామీణ వర్గాలకు సాధికారత కల్పించడం, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, పచ్చదనంతో కూడిన దృఢమైన భారతదేశ నిర్మాణానికి తోడ్పడటం పట్ల తమకున్న అంకితభావాన్ని హెచ్ఎంఐఎఫ్ మరోసారి చాటుకుంది.