సీఎం పదవిపై షిండే ఏమన్నారంటే..
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ ను తానే సిఫారసు చేశానని శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే పేర్కొన్నారు. రెండున్నరేళ్ల క్రితం దేవేంద్ర ఫడ్నవీస్ తనకు ముఖ్యమంత్రిగా ఎలా మద్దతు ఇచ్చాడో తనకు గుర్తుందని ఏక్నాథ్ షిండే చెప్పారు. మహాయుతిలో ఎవరూ ఎక్కువ.. ఎవరూ తక్కువ కాదని తెలిపారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసం గత 2.5 ఏళ్లలో మహాయుతి ప్రభుత్వంలో తాము ముగ్గురు చేసిన కృషి విశేషమైనదన్నారు.
రేపు డిప్యూటీ సీఎంలుగా తాను, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారా అని అడిగిన ప్రశ్నకు.. సాయంత్రం వరకు ఆగండి అని ఏక్‌నాథ్ షిండే చెప్పారు. నవంబర్ 20న జరిగిన రాష్ట్ర ఎన్నికలలో అసెంబ్లీలోని 288 స్థానాలకు గాను 230 స్థానాల్లో బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ ఎన్‌సీపీతో కూడిన మహాయుతి విజయం సాధించింది.
మహారాష్ట్ర కొత్త సీఎంపై పార్టీ కీలక సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ శాసనసభా పక్ష నేతగా, తదుపరి ముఖ్యమంత్రిగా కూడా ఎన్నుకున్న విషయం తెలిసిందే. దేవేంద్ర ఫడ్నవీస్ రాజ్ భవన్ నుంచి విలేకరులతో మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రిని, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి అని ప్రకటించారు.






