18 April, 2026 | 10:07 AM

ఆ చెల్లింపుల వెనుక నా ప్రమేయం లేదు

04-03-2026 12:00 AM

హెచ్‌సీఏ అధ్యక్షుడు అమర్‌నాథ్

సికింద్రాబాద్, మార్చి 3 : విశాఖ ఇండస్ట్రీస్‌కు చెల్లించిన రూ.68.73 కోట్ల అంశం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ను కుదిపేస్తోంది. మంత్రి వివేక్‌కు చెందిన విశాఖ కంపెనీకి హెచ్‌సీఏ అక్రమంగా చెల్లింపులు జరిపిందని క్రికెట్ సంఘాలు ఆరోపిస్తుండగా దీనిపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమర్‌నాథ్ స్పష్టతనిచ్చారు. ఆ చెల్లింపుల వెనుక తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. తాను బాధ్యతలు తీసుకోకముందే అది ప్రాసెస్ జరిగిందని చెప్పారు.

రూ.68.73 కోట్ల చెల్లింపునకు అంశానికి సంబంధించి కోర్టు ఆదేశాలున్నాయని, హెచ్‌సీఏ అవే పాటించింద ని తెలిపారు. ఓ పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని, విశాఖ కంపెనీకి అక్రమంగహా ఎటువంటి చెల్లింపులు జరగలేదని అమర్‌నాథ్ తెలిపారు. హెచ్‌సీఏ, విశాఖ మధ్య స్పాన్సర్‌షిప్ ఒప్పంద రద్దుకు సంబంధించి అర్బిట్రేషన్‌లో వచ్చిన తీర్పు ప్రకారం రూ.25.92 కోట్లు 18 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించిందని వెల్లడించారు.

దీని ప్రకారమే కోర్టు ఆదేశాలతో రూ.68.73 కోట్లు చెల్లించామని తెలిపారు. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడి తొలగింపునకు, ఈ వివాదానికి ఎటువంటి సం బంధం లేదని అమర్‌నాథ్ స్పష్టం చేశారు. దీనిపై ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. 

పత్రికా కథనాన్ని ఖండిస్తున్నాం : విశాఖ ఇండస్ట్రీస్

మరోవైపు తమ కంపెనీకి హెచ్‌సీఏ అక్రమంగా చెల్లింపులు జరిపిందంటూ ఓ పత్రి కలో వచ్చిన కథనం, ఇతర ఆరోపణలను విశాఖ ఇండస్ట్రీస్ ఖండించింది. హెచ్‌సీఏ, విశాఖ మధ్య స్టేడియం నిర్మాణ సమయం లో ఒప్పందం జరిగిందనీ, తర్వాత 2011లో ఒప్పందాన్ని రద్దు చేయడంతో తాము కోర్టు ను ఆశ్రయించినట్టు తెలిపింది. దీనిపై దఫదఫాలుగా జరిగిన విచారణల తర్వాత ఆర్బి ట్రేషన్ ట్రిబ్యునల్ వడ్డీతో సహా రూ.68.73 కోట్లు చెల్లించాలని తీర్పునిచ్చిందని వెల్లడించింది. కోర్టు ఆదేశాల ప్రకారమే చెల్లింపులు జరిగాయని, ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది.

క్రికెట్ సంఘాల మెరుపు ధర్నా 

ఇదిలా ఉంటే రూ.68.73 కోట్ల చెల్లింపు వివాదానికి సంబంధించి ఒకవైపు హెచ్‌సీఏ మీడియా సమావేశం జరుగుతుండగా క్రికె ట్ సంఘాలు మెరుపు ధర్నాకు దిగాయి. హెచ్‌సీఎ అవినీతిలో కూరుకుపోయిందని, యువక్రికెటర్ల కోసం ఉన్న నిధులను దోచుకున్నారంటూ క్రికెట్ సంఘాల ప్రతినిధులు నినాదాలు చేశారు. హెచ్‌సీఏను రద్దు చేసి యువక్రికెటర్ల భవిష్యత్తును కాపాడాలంటూ డిమాండ్ చేశారు. నిధులను లూటి చేస్తున్న ముఠాను తరిమికొట్టాలంటూ నినాదాలు చేసారు. ధర్నా చేస్తున్న క్రికెట్ సంఘా ల ప్రతినిధులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానికపోలీస్ స్టేషన్‌కు తరలించారు.