calender_icon.png 15 August, 2025 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ షరతులను అమలు చేస్తే వేతనాల పెంపునకు సిద్ధమే

14-08-2025 12:00:00 AM

సినీకార్మికుల సమ్మె పదో రోజుతో తెర పడుతుందని భావించినవారికి నిరాశే మిగిలింది. బుధవారం జరిగిన చర్చల్లో వేతనాల పెంపు అంశం కొలిక్కి రాలేదు. ఫిల్మ్ ఛాంబర్‌లో ఫెడరేషన్ సభ్యులు, నిర్మాతలకు ఫిల్మ్ ఛాంబర్ బాధ్యుల సమక్షంలో చర్చలు కొనసాగాయి. ఛాంబర్ తరఫున అధ్యక్షుడు భరత్ భూషణ్, కార్యదర్శి దామోదర్ ప్రసాద్, ట్రెజరర్ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. ఫెడరేషన్ నుంచి కో కమిటీ చైర్మన్ వీరశంకర్, ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్‌కుమార్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, ట్రెజరర్ అలెక్స్, మహిళా ప్రొడక్షన్ నాయకురాలు లలిత తదితరులు హాజరయ్యారు.

నిర్మాతల మండలి నుంచి ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, సీ కల్యాణ్, భోగవల్లి బాపినీడు, ఆచంట గోపినాథ్, ఠాగూర్ మధు, మైత్రి సీఈవో చెర్రీ, జెమిని కిరణ్, ఎస్‌కేఎన్, సుప్రియ యార్లగడ్డ, వివేక్ కూచికబోట్ల, స్రవంతి రవికిషోర్, డైరెక్టర్ తేజ, వైవీఎస్ చౌదరి, రామ సత్యనారాయణ తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. చర్చలు కొలిక్కి రాలేదని వెల్లడించారు. “దాదాపు నాలుగు గంటల పాటు అన్ని అంశాలనూ చర్చించాం.

ప్రస్తుతం సానుకూల ధోరణిలో చర్చలు జరుగుతున్నాయి. నిర్మాతల నుంచి కొన్ని షరతులు ఉన్నాయి. ముఖ్యంగా 2018, 2022ల్లో జరిగిన అగ్రిమెంట్లలో ఉన్న రెండు షరతులను వాళ్లు అమలుచేయడంలేదు. ముందు వాటిని ఒప్పుకోవాలి. కొత్తగా మరో రెండు షరతులున్నాయి.

వాటిని ఛాంబర్ ద్వారా వాళ్ల దృష్టికి తీసుకొచ్చాం. వాటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటే, వేతనాల పెంపునకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నాం. రూ.2 వేలు కన్నా తక్కువ వేతనం తీసుకునేవారికి ఒక పర్సంటేజీ ఆఫర్ ఇస్తున్నాం. దానికన్నా ఎక్కువ వేతనం తీసుకునేవాళ్లకు మరో పర్సంటేజీ ఇవ్వాలని ప్రతిపాదించాం. ఫెడరేషన్‌లోని అన్ని యూనియన్లతో మాట్లాడుకొని వస్తే, దీన్ని పరిష్కరిస్తాం” అని తెలిపారు.