14-08-2025 12:00:00 AM
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్ర ల్లో నటించిన తాజాచిత్రం ‘వార్ 2’. బాలీవుడ్ హీరో హృతిక్, టాలీవుడ్ స్టార్ తారక్ కలిసి నటించిన సిని మా కావడంతో అందరిలో మంచి అంచనాలున్నాయి. ముఖ్యంగా యాక్షన్ ప్రియులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం భాషల్లో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా టీమ్ ఓ స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇటీవల కాలంలో ఏ కొత్త సినిమా విడుదలైనా.. థియేటర్లలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే పైరసీ సైట్స్‌లోకి వచ్చేస్తోంది. మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, పైరసీ భూతాన్ని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. హెచ్‌డీ క్వాలిటీతో మంచి ఆడియోతో పైరసీ వస్తుండటం సినిమా ఓపెనింగ్స్‌పై ప్రభావం పడుతోంది.
మరోవైపు మొదటి రోజు సినిమా చూసిన ప్రేక్షకులు ఉత్సాహంతో థియేటర్లో వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో ట్విస్టులు రివీల్ అవ్వడమేకాక ఆసక్తిని హరించివేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇలాంటివి ప్రోత్సహించొద్దంటూ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వీడియో ద్వారా ప్రేక్షకులకు విజ్ఞ్ఞప్తి చేశారు. ‘పైరసీకి నో చెప్పండి. మీ మిషన్.. రియల్ యాక్షన్‌ను సినిమా థియేటర్లలో బిగ్‌స్క్రీన్‌పైనే అనుభూతి చెందండి. ‘వార్2’ చిత్రంలోని సన్నివేశాలను లీక్ చేయొద్దని బ్రతిమాలుతున్నాం. పైరసీని ప్రోత్సహించకండి. ఏ రకమైన పైరసీనైనా reportpiracy@yashrajfilms.com ద్వారా మాకు తెలియజేయండి’ అని హృతిక్, తారక్ పేర్కొన్నారు.