calender_icon.png 28 July, 2025 | 10:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసులు చెప్పినట్లు నేను లొంగిపోలేదు

28-07-2025 01:31:24 AM

మాజీ మావోయిస్ట్ నేత మాల సంజీవ్

మల్కాజిగిరి, జూలై 27 : జననాట్యమండలి సీనియర్ సభ్యుడు, ప్రముఖ ప్రజా గాయకుడు, మాజీ మావోయిస్ట్ నేత మాల సంజీవ్‌కు యాప్రాల్ ప్రజలు ఆదివారం అఖండ సానుభూతితో స్వాగతం పలికారు. జననాట్యమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయిక కార్యక్రమం యాప్రాల్‌లో ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ, నేను లొంగిపోయానని అంటున్నారు కానీ నేను లొంగిపోలేదు ఆరోగ్య కారణాల వల్లనే చట్టబద్ధంగా జనజీవన స్రవంతిలోకి వచ్చాను అని స్పష్టం చేశారు.

నన్ను యాప్రాల్ ప్రజల గుండెల్లో పెట్టుకుంటారని నమ్ముతున్నాను. పాటల రూపంలో నేను తిరిగి వస్తున్నా అంటూ ఉద్వేగంగా పేర్కొన్నారు. విప్లవ కళాకారులతో ఎవరూ పోటీ పడలేరని ఆయన ఉద్ఘాటించారు. 1977లో కుటామిలో పని మొదలైంది. 1986 వరకు గద్దర్తో దేశవ్యాప్తంగా పనిచేశాను. 1996లో అడవుల్లోకి వెళ్లి మనుగూరు మండలంలో డీవీసీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించాను  అని తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు.

ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 15 వేల మంది దళ సభ్యులను స్మరించుకుంటూ, వారికి విప్లవాభినందనలు, శ్రద్ధాంజలి అర్పించారు. నర్సింగ్, గద్దర్ నా తొలి గురువులు, అని తెలిపారు. యాప్రాల్లో భజన గీతాలతో నా ప్రస్థానం మొదలై, ప్రజా గాయకుడిగా మారాను అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వందనమో వందనమమ్మా& అనే విప్లవ గీతంతో సహా పలు పాటలను ఆలపించి, సభలోని వారిని ఆకట్టుకున్నారు.

ప్రస్తుతం భారతదేశ రాజ్యాంగంపై దాడి జరుగుతోందని, మిగిలిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అంటూ పిలుపునిచ్చారు. సాంస్కృతిక ఉద్యమాల్లో తాను పాటగా మారానని, యాప్రాల్, అల్వాల్, వెంకటాపురం వంటి ప్రాంతాలు సాంస్కృతికంగా పునాదులుగా నిలిచాయని పేర్కొన్నారు. పాటల వలన ఆదివాసీ ప్రజలు చదువుకొని, లెజెండ్లుగా మారారు అని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ప్రముఖులు వి. నరసింగ్ రావు, సత్యం, రాజనర్సింహ, సి.ఎల్. యాదగిరి, ప్రేమ్ కుమార్, అనిల్, రాజు, డప్పు కళాకారులు గోపాల్, బాబులు తదితరులు పాల్గొన్నారు.