10-10-2025 01:51:10 AM
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం ఆయన హైకోర్టు వద్ద మీడియాతో మాట్లాడారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వం కుల సర్వే నిర్వహించి, డెడికేటెడ్ కమిషన్ వేసి, సబ్ కమిటీ వేసి కేబినెట్ ఆమోదించి, శాసనసభలో చట్టం చేసి గవర్నర్‌కు పంపంచాం.
2018 పంచాయతీ రాజ్ చట్ట సవరణ కూడా చేశాం. స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్. బీఆర్‌ఎస్, బీజేపీలు హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదో జవాబు చెప్పాలి.
మంత్రి పొన్నం ప్రభాకర్
కోర్టులో కేసులు వేయించింది బీఆర్‌ఎస్సే
బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేయించింది బీఆర్‌ఎస్ పార్టీనేనని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. గురువారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి బీసీలకు అన్యాయం చేస్తున్నాయి.
బిల్లును గవర్నర్ ఆమోదించలేదు. దానికి కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలను బీసీ బిడ్డలు ప్రశ్నిస్తారు.. ఆ రెండు పార్టీల నేతలకు కర్రుకాల్చి వాతపెడుతారు. శాస్త్రీయంగా, సాంకేతికంగా, సమగ్రంగా తెలంగాణ కులగణన తదుపరి కార్యచరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
మంత్రి జూపల్లి కృష్ణారావు
బీసీలు అధైర్యపడవద్దు
బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు తీర్పుపై బీసీ బిడ్డలు ఎవరూ అధైర్యపడవద్దని, ఎన్ని అడ్డంకులు వచ్చినా కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పదని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం హైకోర్టు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టు స్టే ఇవ్వకుండా ఉండేందుకు తాము ఎంతో ప్రయత్నించాం
కోర్టు నిర్ణయం బీసీల నోటివద్ద ముద్ద లాగేసినట్టు అయింది. కోర్టు తీర్పు కాపీ చూశాక ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తాం. న్యాయనిపుణుల సలహాలతోనే బిసీ బిల్లులు పాస్ చేశాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో కార్యచరణ తీసుకోబోతున్నాం. సుప్రీంకోర్టుకు వెళ్లే విషయాన్ని పరిశీలిస్తాం
మంత్రి వాకిటి శ్రీహరి ఆవేదన
హైకోర్టు స్టే విధించడం దురదృష్టకరం
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం దురదృష్టకరమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఆయన హైకోర్టు వద్ద మీడియాతోర మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. కేంద్రం సహకరించకపోయినా, గవర్నర్ పట్టించుకోకపోయినా, ప్రతిపక్షాలు కలిసి రాకపోయినా సీఎం రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం చేశారు.
సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పద్ధతి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాం. బీసీల నోటికాడి బువ్వ అందకుండా పోయింది. అయినా మేం నిరాశ చెందకుండా పోరాటం కొనసాగిస్తాం. తప్పకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించి పెడతామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఇప్పటికైనా బీసీల ఆవేదనను అర్థం చేసుకోవాలి. బీసీలు ఎవరూ అధైర్యపడొద్దు.. తప్పనిసరిగా రిజర్వేషన్లు సాధించుకుందాం.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్