calender_icon.png 4 December, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షమాపణలు చెప్పాల్సిందే

04-12-2025 02:08:26 AM

  1. హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు సహించం
  2. సీఎం రేవంత్  వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్
  3. రాష్ట్రవ్యాప్తంగా దిష్టిబొమ్మల దహనం 

ఎల్బీనగర్/మేడిపల్లి/రాజేంద్రనగర్, డిసెంబర్ 3 (విజయక్రాంతి):హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకులు మండిపడ్డారు. హిందువులకు మూడు కోట్ల మంది దేవుళ్లు ఉన్నారని, మనకు దేవుడిపైనే ఏకాభిప్రాయం లేదని సీఎం వ్యాఖ్యానించడం సరికాదంటూ బీజేపీ నాయకులు, హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ యువ మోర్చా బుధవారం ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు ఆందోళనలు నిర్వహించారు. రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్చార్జి ఏనుగు సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో మేడిపల్లిలో వరంగల్ జాతీయ రహ దారిపై రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

పీర్జాదిగూడ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పవన్‌రెడ్డి పాల్గొన్నారు. సీఎంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కార్పొరేటర్ శ్రీవాణి ఫిర్యాదు చేశారు. కమలానగర్‌లో ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

గడ్డిఅన్నారం డివిజన్ కమలానగర్ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు దాసరి జయప్రకాశ్, నాయకులు పాల్గొన్నారు. హయత్ నగర్ సాయిబాబా గుడి వద్ద జరిగిన కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రధాన కార్యదర్శి బండారి భాస్కర్, డివిజన్ అధ్యక్షుడు గంగాని శ్రీనివాస్, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పారంద మహేశ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి గోవిందాచారి పాల్గొన్నారు.

హస్తినాపురం డివిజన్ జడ్పీ రోడ్డులో జరిగిన కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు ఎరుకల మల్లేశ్ గౌడ్ పాల్గొన్నారు. ఆరాంఘర్ చౌరస్తాలో బిజెపి గోల్కొండ జిల్లా ఇన్చార్జి వై. శ్రీధర్, చేవెళ్ల లోక్‌సభ కన్వీనర్ ఎన్ మల్లారెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇంచార్జి తోకల శ్రీనివాస్‌రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ పొన్నమోని మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి బీజేపీ నాయకులు  ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.