04-12-2025 02:06:39 AM
హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకు రాష్ర్టంలో 61,379 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. ఏళ్లకేళ్లుగా నియామకాలకు నోచుకోక తల్లడిల్లిన తెలంగాణ నిరుద్యోగ యువత భవిష్యత్‌కు భద్రత కల్పించింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొలువుల పండుగను నిర్వహించి నిరుద్యోగులకు తన చేతుల మీదుగా నియామక పత్రాలను అందించి సరికొత్త ఒరవడి నెలకొల్పారు.
ఉద్యోగాల భర్తీలో తెలంగాణ ఈ రెండేండ్లలో కొత్త రికార్డు నమోదు చేసింది. దేశంలో ఏ రాష్ర్టంలోలేని విధంగా భారీ సంఖ్యలో రాష్ర్ట ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టింది. 61,379 ప్రభుత్వ ఉద్యోగాలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేసింది. మరో 8632 పోస్టుల నియామకాలు తుది దశలో ఉన్నాయి. వీటితో కలిపితే మొత్తం ఉద్యోగ నియామకాల సంఖ్య 70,011. త్వరలోనే లక్ష ఉద్యో గాల మైలురాయిని అందుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మిగ తా రాష్ట్రాలకు సైతం ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి.
ఉద్యోగాల భర్తీలోనూ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కీలక రంగాలకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. రాష్ర్ట ప్రభుత్వం తొలి రెండేండ్లలోనే కీలకమైన పరీక్షలను విజయవంతంగా నిర్వహించి.. చెప్పిన సమయానికి పోస్టింగ్లు కూడా ఇచ్చేయడం గమనార్హం. రెండేండ్లలో 13 సార్లు కొలువుల పండగ వేడుకలు నిర్వహించారు. రాష్ర్టంలో ఉద్యోగాలు సాధిం చిన యువతను ఆహ్వానించి ఎల్‌బీ స్టేడియం, శిల్ప కళా వేదికలో భారీ వేడుకగా కొలువుల పండగ జరిపారు.