ప్రజల కోసం ఏమైనా చేస్తా
- నేను అమ్ముడు పోయే వ్యక్తిని కాదు
- కేసీఆర్ చేసిన.. రేవంత్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చెప్తా
- ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బాన్సువాడ, ఆగస్టు 13 (విజయ క్రాంతి): నియోజకవర్గ ప్రజల కోసం ఏమైనా, ఏ త్యాగమైన చేయడానికి సిద్ధంగా ఉన్నాననీ బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరాలో రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని పోచారం గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. తన వ్యాఖ్యల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టంచేశారు.
తాను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని పేర్కొన్నారు. తనకు స్వార్థం ఉందంటూ కొందరు బుద్ధిహీనులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ చేసిన పనులను తాను ప్రశంసించిన సందర్భంలో ఆయన చేశారు కాబట్టే చెప్పానని వివరించారు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరిస్తానని తెలిపారు. ప్రజల కోసమే తన జీవితం అంకితం చేశానని అన్నారు.
ప్రజలకు అనుకూలంగా పనిచేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. తనకు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవని, తాను ఎవరి వద్దా డబ్బులు తీసుకోలేదని స్పష్టంచేశారు. తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఏడు దఫాలుగా ప్రజా ప్రతినిధిగా సేవ చేసే అవకాశం తనకు లభించిందని తెలిపారు. నియోజకవర్గ ప్రజల కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని నొక్కిచెప్పారు. నియోజకవర్గ అభివృ ద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరి పేరును ప్రస్తావించడం తన ధర్మం, మానవత్వమన్నారు.






