10 April, 2026 | 3:50 AM

బీఆర్‌ఎస్‌లో చేరుతా

10-04-2026 02:02 AM
  1. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
  2. జగిత్యాలలో జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  3. మాజీ మంత్రిని స్వయంగా పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ 
  4. గంటపాటు ఇరువురి మధ్య కీలక భేటీ
  5. శేషజీవితంలో కేసీఆర్‌తో పనిచేసే అవకాశం దక్కడం ఆనందంగా ఉందన్న -జీవన్‌రెడ్డి 
  6. రాష్ట్రంలో రైతులు, పేదలు సంతోషంగా జీవించాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్న కేటీఆర్

జగిత్యాల, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): ఇటు జగిత్యాల జిల్లాలో, అటు రాష్ట్రంలో రాజకీయంగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకీ రాజీనా మా చేసిన మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరుతానని స్పష్టం చేశారు. శేషజీ వితంలో కేసీఆర్‌తో పనిచేసే అవకాశం దక్కడం నాకు ఆనందంగా ఉం దన్నారు. గురువారం జగిత్యాలలోని జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయనను పార్టీలో చేరాలని స్వయంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులు, పేదలు మళ్లీ సంతోషంగా జీవించాలంటే కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుతున్నారని కేటీఆర్ అన్నారు. జగిత్యాల జిల్లాలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి నివాసానికి కేటీఆర్ వెళ్లడం జిల్లా రాజకీయాల్లో చర్చనీ యాంశంగా మారింది. జగిత్యాలకు చేరుకున్న కేటీఆర్‌కు బీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ధరూర్ నుంచి భారీ బైక్ ర్యాలీగా కార్యకర్తలు ఆయనతో కలిసి జీవన్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా కార్యకర్తలు ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. తరువాత జీవన్‌రెడ్డి ఇంటికి చేరుకున్న కేటీఆర్, వారి మధ్య సుమారు గంటపాటు కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో జీవన్‌రెడ్డిని బీఆర్‌ఎస్ పార్టీలోకి రావాలని కేటీఆర్ అధికారికంగా ఆహ్వానించారు. ఈనెల 27న జరగనున్న బీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో జీవన్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకునే అవకాశముందని తెలిసింది. ఆయనకు పార్టీ సెక్రటరీ జనరల్ పదవి ఆఫర్ చేసినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మీడి యాతో మాట్లాడుతూ, జీవన్‌రెడ్డి తమ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ‘కేసీఆర్‌తో నాకు వ్యక్తిగత అనుబంధం ఉంది. మీరు అందరూ వచ్చి ఆ హ్వానించడం సంతోషంగా ఉంది. త్వరలో కేసీఆర్‌ని కలిసి, రెండు మూడు రోజుల్లో నా నిర్ణయం ప్రకటిస్తా’ అని జీవన్‌రెడ్డి తెలిపినట్లు కేటీఆర్ వెల్లడించారు. ఈ సం దర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు, పేదలు మళ్లీ సంతోషంగా జీవించాలంటే కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా కావాల్సిందేనని అన్నారు.

తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే అనుభవజ్ఞులైన నాయకుల అవసరం ఉందని, అందుకే జీవన్‌రెడ్డి సహకారం కోరుతున్నామని తెలిపారు. జీవన్‌రెడ్డి నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో సేవలందించిన నిబద్ధత కలిగిన నాయకుడని కేటీఆర్ పేర్కొన్నారు. 2014లో కూడా కేసీఆర్ వారిని బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించిన విషయం గుర్తుచేశారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీపై ఉన్న నిబద్ధతతో వారు నడుచుకున్నారని చెప్పారు. కేసీఆర్, జీవన్‌రెడ్డి మధ్య నాలుగు దశాబ్దాలకు పైగా ఉన్న వ్యక్తిగత అనుబంధం, పరస్పర గౌరవం రాజకీయాలకు అతీతమని కేటీఆర్ వివరించారు.

కరీంనగర్ జిల్లాలో అభివృద్ధి పనులకు జీవన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వెంటనే ఆమోదం ఇచ్చిన సంఘటనను గుర్తుచేశారు. అసెంబ్లీలో జీవన్‌రెడ్డి రైతుల సమస్యలపై గట్టిగా పోరాడిన నాయకుడని, నిజాం షుగర్స్ అంశంపై ఆయన చేసిన పోరాటాన్ని కేటీఆర్ ప్రస్తావించా రు. కోఆపరేటివ్ విధానంలో షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు మహారాష్ట్ర విధానాన్ని అధ్యయనం చేసి అవసరమైతే దానికి చైర్మన్‌గా ‘మీరే ఉండాలి’ అని ఆనాడు అసెంబ్లీలో కేసీఆర్ ఇచ్చిన ఆఫర్‌ను కూడా గుర్తుచేశారు.

మాజీమంత్రి జీవన్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించేందుకు ఎలాంటి సంకోచం లేకుండా పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని, తెలంగాణలో తిరిగి కేసీఆర్ ప్రభుత్వం రావాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు వచ్చిన జగిత్యాల జిల్లా నాయకత్వానికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. జీవన్‌రెడ్డి చేరిక కచ్చితంగా మన పార్టీకి అద్భుతమైన బలాన్ని చేకూరుస్తుందని చెప్పిన స్థానిక నాయకులు, జీవన్‌రెడ్డి ఆహ్వానించేందుకు వారు చేసిన కృషిని అభినందించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత రెండు న్నర సంవత్సరాలుగా ప్రభుత్వం పూర్తిగా వైఫల్య పాలనను కొనసాగిస్తోందని, ప్రజలదృష్టి మళ్లించేందుకు మాత్రమే పాలకులు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రైతు బంధు పథకాన్ని మూడుసార్లు అమలు చేయకుండా రైతులకు రూ.27 వేల కోట్ల బకాయిలు పెడుతూ, మరోవైపు రుణమాఫీ పేరుతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నా రని విమర్శించారు.

రైతుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని పేర్కొన్నారు. ‘కండలు తిరిగిన వీరుడైనా మూడు నెలల్లో పిల్లలను పుట్టించలేదు’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు తీవ్ర అభ్యంతరకరమన్నారు. సీఎం తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం మహిళల పట్ల అవమానక రంగా ప్రవర్తిస్తోందని, సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఇది తెలంగాణ సంస్కృతికి విరుద్ధమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా మోసం చేశారని కేటీఆర్ విమర్శించారు. ఆర్థిక పరిస్థితి తెలుసుకొని హామీలు ఇచ్చామని చెప్పి, ఇప్పుడు వెనక్కి తగ్గడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. కాంగ్రెస్ లోపలే అసంతృప్తి పెరుగు తోం దని, కార్యకర్తలే బీఆర్‌ఎస్ ప్రభుత్వం తిరిగి రావాలని కోరుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు.

కాం గ్రెస్ నాయకత్వం తమ సీనియర్ నేతలను అవమానిస్తూ, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు. అయితే జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరితే ఉత్తర తెలంగాణలో బీఆర్‌ఎస్ మరింత బలోపేతం అవుతుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల మాజీ ఎమ్మె ల్యే విద్యాసాగర్‌రావు, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు రసమయి బాలకిషన్, దాసరి మనోహర్‌రెడ్డి, కేడీసీసీ బ్యాంకుచైర్మన్ కొండూరి రవీందర్‌రావు, కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, మాజీ జడ్పీ చైర్మన్లు తుల ఉమ, దావ వసంత తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్ పర్యటనలో తోపులాట 

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక సందర్భంగా గురువారం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలు ఒక్కసారిగా ఎగబడటంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులకు స్వల్ప గాయాలయ్యాయి. పలువురి వీడియో కెమెరాలు ధ్వంసం అయ్యా యి. క్యూన్యూస్ రిపోర్టర్ సాయి కాలుకు ప్యాక్చర్ అయి తీవ్రగాయం కావడంతో, అతడిని 108 అంబులెన్స్‌లో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కేసీఆర్‌తో పనిచేసే అవకాశం దక్కడం నాకు ఆనందంగా ఉంది : జీవన్‌రెడ్డి 

మాజీ సీఎం కేసీఆర్ సూచన మేరకు కేటీఆర్ మా ఇంటికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించడం పట్ల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ జేస్తున్నానని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేయడం నన్ను భావోద్వేగానికి గురిచేసినప్పటికీ, ఇవాళ బీఆర్‌ఎస్‌తో కలవడం సంతోషంగా ఉందన్నారు.

గత 20 నెలలుగా ఎన్నో అవమానాలను తట్టుకుని ఓపిక పట్టానని, ఎన్నో ప్రభుత్వాలను చూశా ను.. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం తిరోగమన దిశలో సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయం మేరకే బీఆర్‌ఎస్‌లో చేరే నిర్ణయం తీసుకున్నానని, శేషజీవితంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం దక్కడం నాకు ఆనందంగా ఉందని జీవన్‌రెడ్డి తెలిపారు.