10 April, 2026 | 4:06 AM

ఈఎస్‌ఐలో వింత ఉత్తర్వులు

10-04-2026 02:01 AM

డిస్పెన్సరీలను విడదీయాలని తాజా ఆదేశాలు

ఏ రోజు.. ఏ డిస్పెన్సరీ ఎక్కడుంటుందోఎవరికీ తెలియదు!

  1. ప్రభుత్వ భవనాలు చూసుకోవాలంటూ ఈఎస్‌ఐ డైరెక్టరేట్ ఆదేశాలు
  2. సర్కారు భవనాల్లో ఉన్నవాటినీ తిరిగి వేరే సర్కారు భవనాల్లోకి తరలించాలని ఆదేశం
  3. అడ్డదిడ్డమైన ఆదేశాలతో ఉద్యోగుల్లో గందరగోళం
  4. గతంలో కలిపేసిన డిస్పెన్సరీలను వేర్వేరుగా ఏర్పాటుచేయాలంటూ మరో ఉత్తర్వు

హైదరాబాద్, ఏప్రిల్ ౯ (విజయక్రాంతి): ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్‌ఐ) అసలు ముందుకు వెళుతుందా.. వెనక్కి వెళుతుందా అర్థంకాని పరిస్థితి నెలకొంది. అడ్డదిడ్డంగా డైరెక్టరేట్ నుంచి వస్తున్న ఆదేశాలతో ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు, ఆసుపత్రు ల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, డాక్టర్లు, ఫా ర్మాసిస్ట్‌లు, నర్సులు.. అందరూ తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పటివరకు ప్రైవేటు భవనాల్లో ఉన్న డిస్పెన్సరీలను అక్కడి నుంచి తరలించి.. ప్రభుత్వ భవనాల్లోకి తీసుకెళ్లాలని ఆదేశాలిచ్చారు. ఇందు లోనూ తీవ్ర గందరగోళం నెలకొన్న విష యం తెలిసిందే.

ఆయా ప్రభుత్వ భవనాల లో మౌలిక వసతుల లేమితోపాటు అనేక ఇబ్బందులు, సమస్యలు నెలకొన్నాయి. మొదటి అంతస్తుకు వెళ్లాలంటే కనీసం మెట్లులేవు.. మరో భవనంలో టాయిలెట్లు లేవు. ఇంకో భవనానికి అడ్రస్ దొరకడం కష్టం కావడంతో.. అక్షాంశాలు, రేఖాంశాలను చూసుకోవాలని ఆదేశాలిచ్చారు. మ రోటి పోలీసు స్టేషన్‌పైన ఏర్పాటు చేశారు. ఇలా ప్రభుత్వ భవనాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా.. ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.

తాజాగా ఇచ్చిన ఆదేశా లు మరింత గందరగోళానికి దారితీస్తోంది. ఈసారి ఏకంగా.. ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రుల్లో ఉన్న డిస్పెన్సరీలను ఇతర ప్రభు త్వ భవనాల్లోకి మార్చాలంటూ.. ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈఎస్‌ఐలో పనిచేస్తున్న ఉద్యోగులు ముక్కున వేలేసుకుంటు న్నారు. దీనితోపాటు గతంలో విలీనం చేసి ఏర్పాటు చేసిన ఆయా డిస్పెన్సరీలను విడ దీసి మళ్లీ వేరువేరుగా ఏర్పాటు చేయాలంటూ జారీచేసిన ఉత్తర్వులతో విలీనం చేయడం ఎందుకు..? ఇప్పుడు మళ్లీ విడదీయడం ఎందుకంటూ ఈఎస్‌ఐ ఉద్యోగుల తలలు బాదుకుంటున్నారు.

ఆసుపత్రుల్లో ఉన్నవాటిని తరలించండి..

రాష్ట్రవ్యాప్తంగా పలు ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయి. అయితే వీటిని రెండు నెలల్లోగా వేరే ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలంటూ ఈఎస్‌ఐ డైరెక్టరేట్ నుంచి ఆదేశాలు అందాయి. తార్నాక డిస్పెన్సరీ ప్రస్తుతం నాచారం ఈఎస్‌ఐ ఆసుపత్రి ఆవరణలో పనిచేస్తోంది. అలాగే పటాన్‌చెరు డిస్పెన్సరీ రామచంద్రాపురం ఈఎస్ ఐ ఆసుపత్రి ఆవరణలో, వరంగల్ ఈఎస్‌ఐ ఆసుపత్రి ఆవరణలో ఇండస్ట్రియల్ కాలనీ డిస్పెన్సరీ,

సిర్పూర్ కాగజ్‌నగర్ ఈఎస్‌ఐ ఆసుపత్రి ఆవరణలో ఎస్‌పీఎం కాలనీ డిస్పెన్సరీ, అలాగే జీడిమెట్ల డయాగ్నొస్టిక్ సెంటర్ ఆవరణలో ఉన్న భవనా ల్లో.. బాలానగర్ (న్యూ), బోరబండ, జీడిమెట్ల జీడిమెట్ల డిస్పెన్సరీలు నడు స్తున్నాయి. వాస్తవానికి గతంలో ఇవన్నీ ఆ యా ప్రాంతాలకు సమీపంలోనే నడిచేవి. అయితే ప్రైవేటు భవనాల్లో అద్దెలు చెల్లించడం ఇబ్బంది అవుతుందని, ఆర్థికంగా భారం అవుతుందని భావించిన ఈఎస్‌ఐ డైరెక్టరేట్ ఆయా డిస్పెన్సరీలను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, భవనాల్లోకి తరలించాయి.

నానా కష్టాలుపడి అక్కడ ఉన్న సామానంతా తీసుకొచ్చి సర్దుకున్నారు. కొంత కాలంలోనే ఇప్పుడు వేరే ప్రభుత్వ భవనాలు చూసుకోండని 8 డిస్పెన్సరీలకు ఆదేశాలివ్వడంతో నోరెళ్లబెడుతున్నారు. వేరే ప్రాంతం లో ఉన్నవాటిని ఇక్కడికి తీసుకురావడం ఎందుకు.. ఇప్పుడు ఇక్కడి నుంచి వేరే ప్రభుత్వ భవనాలు చూసుకోండని చెప్పడం ఎందుకు అంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తు న్నారు. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ భవనాలను ఎలా వెతుక్కోవాలంటూ తలలుపట్టుకున్నారు.

విలీనం కుదరదు.. విభజించండి..

కొత్త భవనాలు చూసుకోవలని చెప్పడంతోపాటు.. మొత్తం 13 చోట్ల నిర్వహిస్తున్న 26 డిస్పెన్సరీలను విడదీసి.. వేర్వేరుగా నిర్వహించాలని మరో ఆదేశం జారీచే శారు. వాస్తవానికి చాలా సంవత్సరాల నుంచి రెండు డిస్పెన్సరీల చొప్పున విలీనంచేసి.. ఒకేచోట నిర్వహించేలా చేశారు. ప్రస్తుతం అవన్నీ ఒక ప్రెమిసెస్‌లో రెండేసి డిస్పెన్సరీలు పనిచేస్తున్నాయి.

అయితే తాజా ఉత్తర్వులతో విలీనం అయిన 26 డిస్పెన్సరీలను విడదీసి వేర్వేరుగా ఇతర ప్రాంతాల్లో నిర్వహించేందుకు ఉద్యోగులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ భవనాలకోసం వేట మొదలయ్యింది. అలాంటప్పుడు మొదట్లో ఎందుకు విలీనం చేశారు.. ఇప్పుడు మళ్లీ విడదీసి వేటికవే.. విడిగా నిర్వహించాలని చెప్పడం.. గందరగోళానికి దారితీస్తోంది.

ప్రస్తుతం ఇచ్చిన ఆదేశాలతో.. ప్రస్తుతం విలీనం అయి.. ఒకే చోట కొనసాగుతున్న కవాడిగూడ, కవాడిగూడ రోడ్ డిస్పెన్సరీలను విడదీయాల్సి ఉంది. అలాగే.. కవాడిగూడ (న్యూ), విద్యానగర్ డిస్పెన్సరీలు, అమీర్‌పేట, ఖైరతాబాద్ డిస్పెన్సరీ, బోరబండ, బాలానగర్ డిస్పెన్సరీ, బాలానగర్ ఓల్డ్, సనత్‌నగర్‌ొో3 డిస్పెన్సరీ,  చిలకలగూడ, మౌలాలి డిస్పెన్సరీ, డబీర్‌పురా, యాకుత్‌పురా డిస్పెన్సరీ, రామంతాపూర్, ఓల్డ్ సిటీ డిస్పెన్సరీ, సికింద్రాబాద్, రెజిమెంటల్ బజార్ డిస్పెన్సరీ, సనత్‌నగర్ సనత్‌నగర్ డిస్పెన్సరీ, జీడిమెట్ల జీడి మెట్ల డిస్పెన్సరీ, సారపాక, రామవరం డిస్పెన్సరీలను విడదీసి మళ్లీ ఒక్కోదానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసి నిర్వహించాలని పేర్కొనడంతో సంబంధిత ఉద్యోగులు మండిపడుతున్నారు. 

అడ్డదిడ్డంగా ఉత్తర్వులు..

అడ్డదిడ్డంగా ఇస్తున్న ఆదేశాలతో ఉద్యోగులతోపాటు వాటి పరిధిలో ఉన్న ఈఎస్‌ఐ లబ్ధిదారుల్లోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. ఏ రోజు ఏ డిస్పెన్సరీ ఎక్కడుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. గతం లో ప్రైవేటు భవనాల్లో నిర్వహించడం ఆర్థిక భారమని పేర్కొంటూ.. ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రుల పరిధిలో ఉన్న ఖాళీ భవనాలకు పలు డిస్పెన్సరీలను తరలించారు.

ఇప్పుడు వాటినే వేరే ప్రభుత్వ భవనాలు చూసుకోవాలంటూ ఆదే శిం చారు. చాలాకాలంగా 26 డిస్పెన్సరీలను విలీనం చేసి.. మొత్తం 13 డిస్పె న్సరీలుగా నిర్వహిస్తున్నారు. ఇప్పు డు వీటిని విడదీసి 26 డిస్పెన్సరీలు వేటికవే పనిచేయాలంటూ ఆదే శించడంతో ఉద్యోగులు, ఈఎస్‌ఐ లబ్ధిదారుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఏ రోజు ఏ డిస్పెన్సరీ ఎక్కడ ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొన్నది.