12 April, 2026 | 1:44 AM

కష్టపడ్డ కార్యకర్తకు అండగా ఉంటా

12-04-2026 12:24 AM
  1. బీఆర్‌ఎస్ ఆఫర్లకు లొంగలేదు
  2. నమ్మకంతో నిలిచా కాబట్టే క్యాబినెట్‌లో అవకాశం
  3. సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్

జగిత్యాల, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఎన్నికైన సంగనభట్ల దినేష్ పదవి ప్రమాణ స్వీకారం, అభినందన సభ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమానికి మంత్రి అడ్లూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ గెలిచిన, ఓడినా ప్రజల మధ్యనే ఉన్నానని చెప్పారు. అనేక అవమానాలు ఎదుర్కొంటూ ఎన్నికల్లో ఓటమి చెందినా అధైర్య పడకుండా కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకొని ముందుకు సాగానన్నారు. పార్టీలో నమ్మకంతో పని చేశాను కాబట్టే క్యాబినెట్‌లో పని చేసే అవకాశం దక్కిందని మంత్రి అడ్లూరి అన్నారు. బీఆర్‌ఎస్‌లో ఎన్నో ఆఫర్లు వచ్చినా లొంగలేదన్నారు.

జీవన్‌రెడ్డి వైఖరిని ఎత్తిచూపుతూ సన్నబియ్యం పథకం, అర్హులకు రేషన్ కార్డుల అందజేత, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు మార్పు రావాలా? అని మంత్రి అడ్లూరి జీవన్‌రెడ్డిని ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో 2029లోనూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అడ్లూరి ధీమా వ్యక్తం చేశారు.

కొత్తగా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఎన్నికైన సంగనభట్ల దినేష్‌కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, దుద్దిళ్ల శ్రీను బాబుతో పాటు జగిత్యాల జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.