విప్లవానికి నాంది పలికిన ఫూలే
- జగిత్యాలలో ఘనంగా జయంతి వేడుకలు
- మహిళలకు ప్రాధాన్యత మంత్రి అడ్లూరి
- ఫూలే సేవలు అమూల్యం: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
- మహిళా రిజర్వేషన్లకు అప్పటి సంస్కరణలే కారణం: కలెక్టర్
జగిత్యాల, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి శ్రమించి, అణగారిన వర్గాలకు సమాన హక్కులు కల్పించాలని లక్ష్యంతో మహాత్మా జ్యోతిరావు ఫూలే విద్యా విప్లవానికినాంది పలికారని, మహిళలకు ప్రాధాన్య తనిస్తూ బాలికలను పాఠశాలను స్థాపించారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌లతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అడ్లూరి మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఫూలే చూపిన మార్గం ప్రభుత్వానికి మార్గదర్శకమన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా మహానీయులను స్మరించుకుంటున్నామన్నారు. మహిళా అభివృద్ధికి పథకాలు, జిల్లాకు అంబేద్కర్ స్టడీ సర్కిల్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో అవకాశం కల్పించడం, సమానత్వం నెలకొల్పడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. మహాత్మ జ్యోతి బా ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినందుకు అధికారులను అభినందిం చారు.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఫూలే సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు అమూల్యమని పేర్కొన్నారు. విద్యా విస్తరణ, మహిళల సాధికారత, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి తరతరాలకు మార్గదర్శకమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జగిత్యాలకు కాలేజీ, పాఠశాల భవనాల నిర్మాణానికి తోడ్పాటు అందించి, ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఎమ్మెల్యే సంజయ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ..నేడు అమలు చేస్తున్న 33 శాతం మహిళా రిజర్వేషన్లు తీసుకురావడానికి అప్పటి సంస్కర ణలే కారణమని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఫూలే ఆశయాలకు అనుగుణంగా సాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, జిల్లా బి.సి వెల్ఫేర్ అధికారి జి. సునీత, జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ ఏ.వో కిషన్, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, ప్రజా ప్రతినిధులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.




