calender_icon.png 10 August, 2025 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సనత్‌నగర్ క్రిస్టియన్‌ల అభ్యున్నతికి కృషి చేస్తాను: ఎమ్మెల్యే తలసాని

07-08-2025 06:20:21 PM

సనత్‌నగర్ (విజయక్రాంతి): క్రిస్టియన్‌ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani Srinivas Yadav) హామీ ఇచ్చారు. గురువారం వెస్ట్ మారేడ్ పల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సనత్‌నగర్ నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనను కలిసిన నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గ పరిధిలోని క్రిస్టియన్ లకు తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని, మీ అందరికీ ఆ విషయం తెలుసునని అన్నారు. మీరంతా ఐక్యంగా ఉండాలని, మీ సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు.

డివిజన్ ల వారిగా  కూడా కమిటీలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని అనేక చర్చిలను  అభివృద్ధి చేసినట్లు తెలిపారు. తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి బోయగూడ బరేల్ గ్రౌండ్ ( గ్రేవ్ యార్డ్) అభివృద్ధి కి 3 కోట్ల రూపాయల ను మంజూరు చేసి అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు నిలిపివేశారని, తాను అధికారులపై వత్తిడి తీసుకొచ్చిన తర్వాత తిరిగి పనులను ప్రారంభించినట్లు వివరించారు.

నూతన కమిటీ నియోజకవర్గ పరిధిలోని పేద క్రిస్టియన్ లకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం క్రిస్టియన్ లు జరుపుకునే అల్పోన్స్ డే కు వచ్చే వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు తాను చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. నియోజకవర్గ పరిధిలోని గ్రేవ్ యార్డ్ లలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. క్రిస్టియన్ లు ఎంతో గొప్పగా జరుపుకునే క్రిస్మస్ పండుగ ను ఈ సంవత్సరం అత్యంత ఘనంగా నిర్వహిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి జయరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ పాల్, సభ్యులు విలియం, ప్రణయ్, సునీల్, దేవదాస్, జయ, సురేష్ మనోహర్, సామ్ సన్, పరమానందం తదితరులు పాల్గొన్నారు.