01-10-2025 01:50:44 PM
దేశం బయట నుంచి కార్యకలాపాలు..
మమ్మల్ని పట్టుకోవడం అసాధ్యం..
హైదరాబాద్, సిటీ బ్యూరో, (విజయక్రాంతి): తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద పైరసీ రాకెట్‌ను ఛేదించి, సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టాన్ని మిగులుస్తున్న ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్న వేళ, ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ 'ఐబొమ్మ'(iBOMMA) నిర్వాహకులు ఎదురుదాడికి దిగారు. పోలీసుల చర్యలకు తాము భయపడబోమని, తమకు నష్టపోయేది ఏమీ లేదని, "ధైర్యముంటే పట్టుకోండి" అంటూ ఏకంగా తెలంగాణ పోలీసులకే బహిరంగ సవాల్ విసిరారు. "మమ్మల్ని పట్టుకోవడం మీ వల్ల కాదు. మేము భారతదేశం నుంచి మా కార్యకలాపాలు నిర్వహించడం లేదు. మమ్మల్ని పట్టుకోవడానికి మీ దగ్గర టెక్నాలజీ, చట్టపరమైన అధికారం కూడా లేదు," అంటూ తమ వెబ్‌సైట్‌లో ఓ సంచలన ప్రకటన విడుదల చేశారు. పోలీసుల తాజా చర్యల నేపథ్యంలో, 'ఐబొమ్మ' వెబ్‌సైట్ భారత్‌లో తమ సేవలను నిలిపివేస్తున్నట్లు కూడా ప్రకటించింది.
ఇకపై కేవలం భారతదేశం వెలుపల ఉన్న ప్రవాస భారతీయులు మాత్రమే తమ సేవలను వినియోగించుకోగలరని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఐబొమ్మ నిర్వాహకులు టాలీవుడ్ నిర్మాతలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల తీరును తీవ్రంగా ఎండగట్టారు. పైరసీ పెరగడానికి ప్రధాన కారణం అధిక ధరలు, నిర్మాతలకు ఉన్న అత్యాశేనని ఆరోపించారు. ప్రేక్షకులు కొత్త సినిమాలు చూడటానికి అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, హాట్‌స్టార్ అంటూ నాలుగైదు ఓటీటీలకు సబ్‌స్క్రిప్షన్లు తీసుకోవాల్సి వస్తోంది. ఇది వారికి భారంగా మారింది. ఒకే సినిమాను రెండు, మూడు ఓటీటీలకు అమ్ముకుంటూ నిర్మాతలు డ్రామాలు ఆడుతున్నారు. సామాన్యుడికి అందుబాటు ధరల్లో వినోదాన్ని అందించడమే మేము చేస్తున్న పని. అందుకే మమ్మల్ని ఆదరిస్తున్నారు. ముందు మీరు మీ పద్ధతి మార్చుకోండి, అని హితవు పలికారు. ఒకవైపు పైరసీని కూకటివేళ్లతో పెకిలిస్తామని సైబర్ పోలీసులు చెబుతుండగా, మరోవైపు ఐబొమ్మ వంటి వెబ్‌సైట్లు ఇలా నేరుగా సవాలు విసరడం సినీ, పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.