calender_icon.png 1 October, 2025 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మహత్యల తెలంగాణను, అన్నపూర్ణగా మార్చింది కేసీఆర్

01-10-2025 02:20:41 PM

హైదరాబాద్: రైతు ఆత్మహత్యల తెలంగాణను.. అన్నపూర్ణగా మార్చింది.. రైతు సంక్షేమ పథకాలతో సాగును బాగు చేసింది కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) అని మాజీ మంత్రి హరీశ్ రావు(harish Rao) అన్నారు. జాతీయ నేరగణాంక నివేదిక లెక్కలు కాంగ్రెస్ నేతలకు చెంపపెట్టు అన్నారు. ఇవి మాటలు కాదు.. కేంద్రప్రభుత్వం లెక్కలు చెబుతున్న వాస్తవాలన్నారు. రైతును రాజు చేయాలన్న కేసీఆర్ సంకల్పానికి, ఆయన చేసిన నిర్విరామ కృషికి వచ్చిన ఫలితం ఇదంతా అన్నారు. 2014లో 1347 రైతు ఆత్మహత్యలు నమోదు కాగా, 2023 నాటికి 56కి తగ్గుదన్నారు. 2014లో రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ నేడు 14 వ స్థానికి పరిమితం చేశారని చెప్పారు. 

2023లో దేశవ్యాప్తంగా 10,786 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా అందులో తెలంగాణ వాటా కేవలం 0.51శాతం, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్నదాతల ఆత్మహత్యలు రికార్డు స్థాయిలో 95.84శాతం తగ్గుదల కనిపించిందన్నారు. ఇవి మాటలు కాదు, కేసీఆర్ తిరగరాసిన రికార్డులు, కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్న వాస్తవాలని పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో ఒక్కో పథకంతో వ్యవసాయరంగానికి జీవం పోశారు.. సాగును బాగు చేశారని కొనియాడారు. ఉమ్మడి పాలనలో నిత్య దుర్భిక్షం, సాగు విధ్వంసం, వలసల దురవస్థ, ఆత్మహత్యల దౌర్భాగ్యం తెలంగాణ అన్నారు. స్వరాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులతో సుజలమై, ధాన్యపురాశులతో సుఫలమై, సాగుభూమి సస్యశ్యామలమై.. తెలంగాణ కేసీఆర్‌ పాలనలో విరాజిల్లిందన్నారు. తెలంగాణను అన్నంగిన్నెగా దేశానికే ఆదర్శంగా నిలిపింది కేసీఆర్ అన్నారు. కేసీఆర్ కు రైతుకు ఉన్నది పేగు బంధం, ఆత్మ బంధం అయితే.. కాంగ్రెస్ కు ఉన్నది కేవలం ఓటు బంధమని హరీశ్ రావు ఆరోపించారు.