23 March, 2026 | 4:05 AM

శత్రు నౌకలు సహా గల్ఫ్‌నూ వదిలిపెట్టం

23-03-2026 12:00 AM

మిగతా దేశాల నౌకలను అనుమతిస్తాం

అమెరికా జలసంధి జోలికి వస్తే గల్ఫ్‌ను టార్గెట్ చేస్తాం

ఆయా దేశాల్లోని అమెరికన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేస్తం.. చమురు కేంద్రాలను విచ్ఛిన్నం చేస్తాం: ఇరాన్

టెహ్రాన్, మార్చి ౨౨: అమెరికా వాటి మిత్రదేశాల నౌకలు మినహా మిగతా దేశాల అన్ని నౌకలు కూడా హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లొచ్చని ఇరాన్ వెల్లడించింది. 48 గంటల్లోగా ఈ జలమార్గాన్ని ‘పూర్తిగా తెరవకపోతే’ ఇరాన్ విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటల తర్వాత ఇరాన్ ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. హోర్ముజ్ జలసంధి గుండా నౌకలను అనుమతించే విషయంలో ఇరాన్ తన వైఖరిని కొంత సడలించింది.

అమెరికా, ఇజ్రాయెల్ సంబంధించిన నౌకలు మినహా, మిగతా అన్ని రకాల నౌకాయానానికి ఈ జలమార్గం తెరిచే ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికా ఒకవేళ జలసంధి జోలికి వస్తే, తాము గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తామని తేల్చిచెప్పింది ఆయా దేశాల్లోని అమెరికన్ సైనిక స్థావరాలను, చమురు శుద్ధి కేంద్రాలను, నీటి సరఫరా, విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించింది ఈ పరిణామాలపై ఐక్యరాజ్యసమితి ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. గల్ఫ్ సముద్రంలో నౌకల భద్రతను మెరుగుపరచడానికి, నావికులను రక్షించడానికి ఐక్యరాజ్యసమితి సంస్థతో సహకరించేందుకు టెహ్రాన్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.

హోర్ముజ్ జలసంధిలోని ప్రస్తుత పరిస్థితికి మూల కారణం ఇరాన్‌పై ఇజ్రాయెల్‌అమెరికా దాడులేనని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ చమురు, ద్రవీకృత గ్యాస్‌ల్లో ఐదో వంతు ప్రయాణించే కీలకమైన ఇంధన సరఫరా మార్గాన్ని ఇరాన్ ఫిబ్రవరి 28న మూసివేసింది. అమెరికా, ఇజ్రాయెల్, వారి భాగస్వాములకు ఒక లీటరు చమురు కూడా చేరనివ్వబోమని ఇరాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు రక్షణగా ఒక నావికా కూటమిని ఏర్పాటు చేయాలని అమెరికా ప్రయత్నిస్తుండగా, చాలా నాటో మిత్రదేశాలు ఇరాన్‌కు వ్యతిరేకంగా సైనిక చర్యలలో పాల్గొనడానికి ఇష్టపడటం లేదని చెబుతున్నాయి.