అప్సరసలు దిగివస్తే..
అల్లరి నరేశ్ ఫాంటసీ కామెడీ ‘రంభ ఊర్వశి మేనక’తో అలరించబోతున్నారు. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ను టాలీవుడ్ సీనియర్ స్టార్ నాగార్జున సోమవారం లాంచ్ చేశారు. సూరి (అల్లరి నరేశ్) మొక్కులు ఫలించి రంభ, ఊర్వశి, మేనకలు భూలోకానికి దిగిరావటం..
ముగ్గురు అప్సరసలు తన ఇంట్లో ఉండటంతో సూరికి ఎదురయ్యే వరుస సమస్యలతో కథ వినోదాత్మకంగా సాగుతుందని ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇందులో సురభి కథానాయికగా నటించగా, వెన్నెల కిషోర్ ఇంద్రుడి పాత్రలో నవ్వులు పూయించారు. రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ ముగ్గురు అప్సరసలుగా అలరించారు. నరేశ్ వీకే, శ్రీనివాస్‌రెడ్డి, రచ్చ రవి, మురళీధర్‌గౌడ్ వివిధ పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకు సంగీతం: చైతన్ భరద్వాజ్; డీవోపీ: రాంరెడ్డి; ఆర్ట్: బ్రహ్మ కడలి; ఎడిటర్: ఛోటా కే ప్రసాద్.






