18 July, 2026 | 4:00 PM

వలసదారులను తిరస్కరిస్తే సంబంధాలు బంద్

16-12-2024 01:38 AM

వాషింగ్టన్, డిసెంబర్ 15: తాను అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తరువాత అక్రమ వలసదారులను వెళ్లగొడతానని యూఎస్ కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వలసదారులను తమ స్వదేశంలోకి తీసుకోవడానికి నిరాకరించే దేశాలతో వ్యాపారం చేయబోమని ట్రంప్ ప్రకటించారు. టైమ్ మ్యాగజైన్‌తో ఆయన మాట్లాడుతూ అమెరికాలో ఉన్న వలసదారులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించారు.

అమెరికాలో ఉన్న తమ వలసదారులను ఆయా సొంత దేశాలు వెనక్కి పిలిపించుకోవాలని సూచించారు. ఒకవేళ అలా జరగకపోతే ఆయా దేశాలతో అమెరికా వ్యాపార సంబంధాలను నిలిపివేస్తామని హెచ్చరించారు. వలసదారులను వెనక్కి తీసుకోవడానికి నిరాకరించే దేశాలతో అమెరికా నుంచి ఎలాంటి వ్యాపారాలు, ఎగుమతులు, దిగుమతులు ఉండవని పేర్కొన్నారు. అన్నిరకాల వ్యాపారాలను చాలా కష్టతరం చేస్తామన్నారు.

ఆ దేశాలకు సుంకాలను భారీగా పెంచుతామని హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలతో మెక్సికో, వెనిజులా తదితర దేశాల్లో ఆందోళన నెలకొంది. అక్రమ వలసదారులు ఎక్కడున్నా వారిపై సైనిక చర్య తీసుకుంటానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.