మోదీని విమర్శిస్తే బీసీలు తిరగబడతారు
- 42 శాతం రిజర్వేషన్లకు సీఎం కట్టుబడి ఉండాలి
జాతీయ బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, ఏప్రిల్ 19(విజయక్రాంతి): దేశ ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తే బీసీలంతా ఏకమై తిరగబడతారని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. ఇండియా కూటమికి బిసి మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే, బిసిలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేష్లలపై ప్రేవేట్ బిల్లును పార్లమెంటులో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచి ప్రధానిని విమర్శిస్తున్నారని అన్నారు. బీసీల పట్ల ముఖ్యమంత్రికి ప్రేమ ఉంటే 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉండాలని అన్నారు. జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు 42 శాతం బిసి రిజర్వేషన్లతోనే పోవాలన్నారు. లేనిపక్షంలో బీసీ ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో 6 నుండి 8 మంది బిసిలకు ప్రాతినిధ్యం ఉండాలని అన్నారు.
కానీ ముగ్గురు మాత్రమే బీసీ మంత్రులు ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను అరికట్టాలని ఇటీవల జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ర్యాగ అరుణ్ కుమార్ అన్నా హజారేను కలిసి విన్నవించినట్లు తెలిపారు. త్వరలో అవినీతిని అరికట్టేందుకు రాష్ట్రంలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేయాలని అన్నా హజారేను కోరారని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో బీసీ నేతలు మోదీ రాందేవ్, సీ.రాజేందర్, జి.అనంతయ్య, జిల్లపల్లి అంజి, నిఖిల్ పటేల్, వెంకట్ ముదిరాజ్ పాల్గొన్నారు.






