31 July, 2026 | 12:38 AM

రుణమాఫీ కాకపోతే రణమే!

25-08-2024 01:15 AM

‘చలో ఆర్మూర్’కు వేలాదిగా తరలొచ్చిన రైతాంగం

మామిడిపల్లి 44వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయింపు

అర్హులందరికీ ‘మాఫీ’ చేయాల్సిందేనని రాస్తారోకో

సెప్టెంబర్ 15లోపు ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్

సంఘీభావం తెలిపిన బీఆర్‌ఎస్, వామపక్ష పార్టీలు

నిజామాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): అర్హులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని రైతాంగం సమరశంఖం పూరించారు. రాష్ట్రప్రభుత్వం విధించిన ఆంక్షలు, కొర్రీలను బేషరతుగా తొలగించాలని డిమాండ్ చేశారు. యుద్ధప్రాతిపదికన సాంకేతిక సమస్యలకు పరిష్కారం చూపాలని  నినదించారు. మామిడిపల్లి చౌరస్తాలో ని 44వ నంబర్ జాతీయ రహదారిపై కొన్నిగంటలపై కొన్ని గంటలపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

ఇలా శనివారం ‘చలో ఆర్మూర్’ పేరుతో నిజామాబాద్ జిల్లా లో రైతాంగం చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతమైంది. రైతులెవరూ రుణమా ఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరలేదని, పార్టీనే ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందని గు ర్తుచేశారు. సెప్టెంబర్ 15 లోపు బేషరతుగా రుణమాఫీ చేయకపోతే ఆపై రైతు సంఘాల  ఆధ్వర్యంలో ఐక్య కార్యాచరణ అమలు చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అసెంబ్లీని ముట్టడిస్తామని స్పష్టం చేశారు.

రైతుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి  బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి వేలాది మంది రైతులు హాజరయ్యారు. సెప్టెంబర్ 15 లోపు బేషరతుగా రుణమాఫీ చేయాలని డెడ్‌లైన్ విధించారు. జాతీయ రహదారిపై నిరసన చేపట్టవద్దని సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ నిషేధం విధించగా సైతం రైతులు లెక్కచేయకుండా జాతీయ రహదారిపైకి పోటెత్తారు.

చివరకు పోలీసులు నిరసనను ఆర్మూర్ పట్టణం ఓ ప్రైవేటు పాఠశాలలో సూచించగారైతులు ససేమిరా అంటూ జాతీయ రహదారి వైపు పరుగులు తీశారు. రైతుల దీక్షకు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, బీజేపీ నాయకులు పల్లె గంగారెడ్డి, వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు  సంఘీభావం తెలిపారు. 

ఆర్మూర్ రైతుల పోరాటం స్ఫూర్తిదాయకం: కేటీఆర్

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): రుణమాఫీ కోసం శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో రైతులు రాష్ట్రప్రభుత్వంపై చేసిన రణన్నినాదం స్ఫూర్తిదాయకమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ‘ఎక్స్’ వేదికగా కొనియాడారు. రైతుల వెంట బీఆర్ ఎస్ నడుస్తుందని, అర్హులందరికీ రుణమాఫీ వర్తించే వరకు తమ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతా మని ప్రకటించారు.

బీఆర్‌ఎస్ నాయకుల మద్దతు

‘చలో ఆర్మూర్’ నిరసన కార్యక్రమానికి బీఆర్‌ఎస్ మద్దతు పలికింది. ఈ సందర్భంగా బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్మూర్ తాలుకా రైతాంగ పోరాటాలకు పెట్టింది పేరని, ఈ ప్రాంత రైతులకు తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు బీఆర్‌ఎస్ పోరాటానికి సిద్ధమైందని స్పష్టం చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో 51,128 రైతులకు 15,849 మందికి, ఆర్మూర్‌లో 40,862 మంది రైతులకు 12,472 మందికి, నిజామాబాద్ రూరల్‌లో 52,646 మంది రైతులకు 12,472 మందికి మాత్రమే రుణమాఫీ అయిందన్నారు. మూడు నియోజకవర్గాల్లో కలిపి 93,495 మంది రైతులకు రుణమాఫీ వర్తించాల్సి ఉందన్నారు. ధర్నాలో టీడీపీ రైతు విభాగం నాయకుడు దేగాం యాదాగౌడ్, కమ్యునిస్టు నాయకులు వి.ప్రభాకర్, ఇతర రైతుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.