42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే రాష్ర్టంలో రణరంగమే
- సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య
కుల గణన జరగకపోవడం బాధాకరం: అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి
ముషీరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే రాష్ర్టంలో రణరంగమేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఈ పద్ధతి మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు, దేశవ్యాప్త కులగణన అంశాలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం 36 బి.సి సంఘాలు, 40 కుల సంఘాలు కాచిగూడలోని హోటల్ అభినందన్ గ్రాండ్స్ లో బీసీ నాయకుల సమావేశం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగింది.
రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు రిజర్వేషన్లు చట్టపరమైన హామీతో కల్పించాలని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్ లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీసీలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించేలా చట్టపరమైన రిజర్వేషన్ విధానం అమలు చేయాలి అని డిమాండ్ చేశారు.
వాస్తవంగా దాదాపు 12 నెలల క్రితం జరగవలసిన ఎన్నికలు బీసీ రిజర్వేషన్ గురించి వాయిదా మీద వాయిదా పడుతూ జాప్యం జరుగుతుందన్నారు. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల విషయం పూర్తిగా పరిష్కారం కాలేదని, ఇది పరిష్కారం కాకుం డా పెంచకుండా ఎన్నికలకు ఎలా వెళ్ళడం న్యాయం కాదన్నారు. ప్రతి పక్ష పార్టీలు బి.సి రిజర్వేషన్ల విషయంలో తమ వైఖరి ప్రకటించాలని కోరారు.బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతం అసెంబ్లీలో చట్టం చేశారు.
కానీ దీని ప్రకారం ఇంతవరకు ప్రభుత్వ జిఓ జారీ కాలేదన్నారు. అసెంబ్లీ చట్టం చేసిన తర్వాత క కేంద్రానికి పంపామన్నారని. దీనిని కేంద్రంకు పంపవలసిన అవసరం లేదన్నారు. మాజీ స్పీకర్,ఎమ్మెల్సీ మధుసూదనా చారి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కులగనన జరగకపోవడం అత్యంత బాధాకరమన్నారు. బీసీలు అసమానతలకు గురవుతున్నారు అంటే పాలకవర్గాల కుట్రలే కారణమన్నారు.
బీసీలు మేమెంతో మాకంత వాటా కావాలనే నినాదంతో ఉద్యమించాలన్నారు. ఈ సమావేశంలో గుజ్జ సత్యం, నీల వెంకటేష్, జిల్లపల్లి అంజి, కోలా జనార్ధన్, మణికంఠ, అనంతయ్య, రాజేందర్, రాజు నేత, పగిళ్ళ సతీశ్, మోదీ రాందేవ్, నరేశ్ గౌడ్, శివ యాదవ్, లింగ ముదిరాజ్, శారద గౌడ్, లక్ష్మి, లతా, మల్లేశ్ పటేల్, బాలయ్య, బలరామ్ తదితరులు పాల్గొన్నారు.






