17 July, 2026 | 12:45 AM

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

17-07-2026 12:00 AM

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్యానికి మూల స్తంభం ఎన్నికలు. ఎన్నికల విశ్వసనీయతకు పునాది ఓటరు. ఓటర్ జాబితా సక్రమంగా లేకపోతే ప్రజాస్వామ్య ప్రక్రియపైనే ప్రశ్నలు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎన్నికల సంఘం దృష్టిలో ఇది ఓటర్ జాబితాను శుద్ధిచేసే పరిపాలన ప్రక్రియ.

కానీ, రాజకీయ పార్టీలు, పౌర హక్కుల సంఘాలు, ఎన్నికల నిపుణులు ఒక కీలక ప్రశ్న లేవనెత్తుతున్నారు. ఈ ప్రక్రియ అమలులో పారదర్శకత, సమానత్వం, సహజ న్యాయం పాటించడం లేదని ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. సర్‌పై ఎవరికి, ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ, అమలు విధానంపై మాత్రం అభ్యంతరాలు ఉన్నాయి. ఇప్పటికే సర్ పక్రియ పూర్తి చేసిన రాష్ట్రాల్లో సుమారు 7.2 కోట్ల ఓట్లు తొలగించారు. వాటిపై ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ స్పందించడం లేదు.

కోర్టును ఆశ్రయించినా న్యాయం దక్కడం లేదు. అందుకే సర్ ప్రజాస్వామ్యాన్ని బలపర్చడానికా, బలహీనపర్చడానికా అన్న అనుమానాలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా కీలకం. ఓటరు జాబితాలో పేరు లేకపోతే ఓటు కోల్పోయినట్టే. కాబట్టి ఓటరు జాబితా పరిపాలన పత్రం కాదు, అది ప్రజాస్వామ్య పౌరసత్వానికి గుర్తింపు. సర్ ప్రక్రియలో సాధారణంగా గుడిసెవాసులు, పట్టణ పేదలు, వలస కార్మికులు, అద్దె ఇళ్లలో నివసించే కుటుంబాలు, గిరిజనులు, దూర ప్రాంతాల ప్రజలు, వృద్ధులు, దివ్యాంగులు, గుర్తింపు పత్రాలు సులభంగా అందుబాటులో లేని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ ఈ వర్గాల పేర్లు అనుకోకుం డా తొలగితే ఎన్నికలలో వారి ప్రాతినిధ్యం తగ్గుతుంది. పారదర్శకత ప్రజాస్వామ్యానికి ప్రాణం. ఓటరు జాబితా సవరణలో ప్రతి తొలగింపునకు స్పష్టమైన కారణం, ముందస్తు సమాచారం, అభ్యంతరం చెప్పే అవకాశం, స్వతం త్ర అప్పీలు వ్యవస్థ ఉండాలి. లేకపోతే ప్రజల విశ్వాసం దెబ్బతింటుంది. భారత ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ. అందువల్ల ఇది రాజకీయ పక్షపా తం లేకుండా చట్టబద్ధమైన విధానాలను పాటిస్తూ ప్రతి అర్హుడైన ఓటర్ హక్కును రక్షించే విధంగా ఉండాలి.

ప్రజల విశ్వాసమే ఎన్నికల సంఘం బలమైన మూలధనం. రాజకీయ చర్చ, ఇప్పటివరకు జరిగిన ప్రక్రియ, ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న తీరు దీనికి భిన్నంగా ఉంది. దీని ఫలితంగానే సర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నది. సర్ అమలు నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. కొందరు దీనిని నకిలీ ఓటర్ల నిర్మూలనకు అవసరమైన చర్యగా సమర్థిస్తే, మరికొందరు అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించే అవకాశం ఉందని ఆందోళన చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో చర్చలు, వాస్తవాల ఆధారంగా పారదర్శకంగా ఈ ప్రక్రియ జరగడం ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుంది. ప్రపంచంలో అనేక ప్రజాస్వామ్య దేశాలు కూడా ఓటర్ జాబితాను నిరంతరం నవీకరిస్తాయి. అయితే సాధారణంగా పౌరులకు ముందస్తు సమాచా రం ఇచ్చి ఆన్‌లైన్ తనిఖీలు, అభ్యంతరాల పరిష్కారం, సులభమైన నమోదు విధానం వంటి రక్షణ కల్పిస్తాయి. ఇవి ప్రజల విశ్వాసాన్ని పెంచుతాయి. 

ఈ నేపథ్యంలో ప్రతి పౌరుడు తన పేరు ఓటర్ జాబితాలో ఉందో, లేదో తనిఖీ చేసుకోవాలి. మార్పులు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. కొత్తగా అర్హులైన యువతను నమోదు చేయించడంలో సహకరించాలి. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలి. ప్రజాస్వామ్యానికి మేలు చేసే సాధనంగా సర్ మారాలంటే అది కచ్చితత్వం, పారదర్శకత, సమానత్వం అనే మూడు సూత్రాలపై నిలవాలి.

నకిలీ నమోదులను తొలగించడం ఎంత ముఖ్యమో, ఒక్క అర్హుడైన ఓటరి పేరు కూడా అన్యాయంగా తొలగిపోకుండా చూడడం అంతకంటే ముఖ్యమైన ది. ప్రజాస్వామ్య బలం ఎన్నికల నిర్వహణలో మాత్రమే కాదు, ప్రతి పౌరుడు సమానంగా పాల్గొనగల అవకాశాన్ని కల్పించడంలోనే ఉంది. ఓటుహక్కును కాపాడటమంటే కేవలం ఒక వ్యక్తి హక్కులను రక్షించడం కాదు, ఒక దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం.

మాలోతు సాగర్

 వ్యాసకర్త సెల్: 7013805411