రేవంత్‌రెడ్డి మళ్లీ సీఎం అయితే రాజకీయాల నుంచి తప్పుకుంటా
- రైతుల సంక్షేమంపై ఆయనకు చిత్తశుద్ధి లేదు
- ఉంటే వెంటనే రాజీనామా చేసి, మళ్లీ గెలవాలి
- బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
- రైతు సమస్యలపై నిర్మల్ జిల్లా సారంగపూర్‌లో బహిరంగ సభ
- ఎంపీ ఈటల, బీజేపీ ఎమ్మెల్యేలు, నేతల హాజరు
నిర్మల్, మే 28 (విజయక్రాంతి): ప్రజా సం క్షేమం, రైతుల సంక్షేమంపై సీఎం రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధి లేదని, ఉంటే వెంటనే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని, ఆయన మళ్లీ సీఎం అయితే తాను పూర్తిగా రాజకీయాల నుంచి రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేపీ శాసనసభా పక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో గురువారం నిర్వహించిన రైతుల గోస బీజేపీ భరోసాకు అనూహ్య స్పందన లభించింది.
ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు పటేల్, పాల్వాయి హరీష్ బాబు, వెంకటరమణారెడ్డి, రాకేష్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ పాల్గొన్నారు. దస్తురాబాద్, కడెం, ఖానాపూర్, మామడ, సోన్, దిల్వార్పూర్ మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాయం త్రం సారంగపూర్ మండల కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ..
పంట కొనుగోలు విషయంలో వైపల్యం పొందిన సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రజాపాలన ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండున్నర సంవత్సరాలలో ప్రజలకు అన్ని రంగాల్లో మొండిచేయి చూపిందని ధ్వజమెత్తారు. ప్రజా సంక్షేమం రైతుల సంక్షేమంపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని ఉంటే వెంటనే రాజీనామా చేసి మళ్లీ గెలువాలని, మళ్లీ సీఎం అయితే తాను పూర్తిగా రాజకీయాల నుంచి రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.
రాష్ట్రంలో పంట కొనుగోళ్ల అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తూకంలో మూడు కిలోలు అదనంగా జోగుతున్నారని ఆరోపించారు. అక్రమాల వెనుక సీఎం మంత్రుల హస్తముందని, కమీషన్ వాటా ఉందని, అక్రమాల డబ్బు సీఎం జేబులోకి వెళ్లిపోతున్నాయని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు పంటలు విక్రయించుకోవడానికి పెద్ద ఎత్తున ధాన్యం తీసుకొచ్చినప్పటికీ పంటలు కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు.
కాగా, కడెం, దస్తురాబాద్, మామున మండలాల్లో కొందరు రైతులు బీజేపీ నాయకుల ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. మద్దతు ధర కల్పిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి, మంత్రులు కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదని ఈటల రాజేందర్ అన్నారు. పంట కుప్పలు పోసి నెల రోజులైనా కొనేవాడు లేక కొన్న ధాన్యం తరలించలేక గోని సంచులు లేక లారీలు లేక కూలీలు లేక రైతులు కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చాలా గ్రామాల్లో పంటలు అమ్ముకోవడానికి రైతులే లారీలను తెప్పించుకుంటున్నారని గోనె సంచులు ప్రభుత్వం ఇవ్వకపోతే 30 రూపాయలు సొంతంగా ఖర్చు చేస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంట కొనుగోలు తీవ్ర జాప్యం జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. పంటను ప్రభుత్వం కొనాలని రాస్తారోకోలు నిర్వహించినా పట్టించుకోవడం లేదన్నారు.






