రైతుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తాం
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
చండూరు, మే 28: రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం చండూరు పట్టణ కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వడ్ల కొనుగోలు కేంద్రాలలో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. చౌటుప్పల్ ప్రాంతంలో ఏర్పాటుచేసిన ప్రైవేట్ గోదాం కూడా తమ పోరాట ఫలితమేనన్నారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్న ఇప్పటివరకు ప్రారంభం కాలేదని, ఎమ్మెల్యే మాత్రం 15 రోజులలో పనులు ప్రారంభిస్తామని ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చౌటుప్పల్ ప్రాంతానికి వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేయించి 80 శాతం పనులు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎమ్మెల్యే మిగిలిన 20 శాతం పనులు కూడా పూర్తి చేయకుండా పెండింగ్లో పెట్టారని మండిపడ్డారు.
గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి సదుపాయాలు రైతు అవసరాలపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతుందని ఆయన ఆరోపించారు. ప్రస్తుత ఎమ్మెల్యే గ్రామాల అభివృద్ధిని పక్కనపెట్టి కేవలం ప్రచార రాజకీయాలకు పరిమితమయ్యడని ఆయన దుయ్యబట్టారు.
ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం నల్లగొండ జిల్లా అధ్యక్షులు గుర్రం వెంకట్ రెడ్డి, బి ఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బొమ్మర బోయిన వెంకన్న, మాజీ మండల అధ్యక్షులు పెద్ద గోని వెంకన్న, చండూరు మున్సిపాలిటీ అధ్యక్షులు కొత్తపాటి సతీష్,చండూర్ కౌన్సిలర్లు తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్, సామ యాదవ రెడ్డి, కొండ్రెడ్డి మధు, నేర్మట సర్పంచ్ నారపాక వసంత ధనయ్య, బీఆర్‌ఎస్ వివిధ గ్రామాలనాయకులు తదితరులు పాల్గొన్నారు.






