11 August, 2026 | 11:29 PM

మందు ‘పడితే..’!

19-06-2024 12:05 AM
  • మద్యంప్రియులతో పరుల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు

మద్యం మత్తులో కుర్రకారు ర్యాష్ డ్రైవింగ్ 

అతివేగంతో తరచూ రోడ్డు ప్రమాదాలు

నిండు ప్రాణాలు బలితీసుకుంటున్న వైనం

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో మారని తీరు 

తనిఖీలు పెంచాలని ప్రజల డిమాండ్

విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో పార్టీ(విందులు, వినోదాల)ల కల్చర్ కూడా మారుతోంది. బర్త్‌డేలు మొదలు కొని పెళ్లిళ్లు, పండుగలు కలర్‘ఫుల్’గా సాగుతున్నాయి. మారుతున్న కల్చర్‌కు అనుగుణంగా ఫంక్షన్లలో మద్యం ఓ మర్యాదగా మారింది. దొరికిందే తడవుగా తలకెక్కేదాకా తాగి.. కొందరు ఆకతాయిలు నడిరోడ్డుపై వాహనాలతో విన్యాసాలు పోతున్నారు.  ర్యాష్ డ్రైవింగ్‌తో వారి ప్రాణాలకే కాకుండా ఇతరుల జీవితాలకు  ప్రమాదకరంగా మారుతున్నారు. పోలీసులకు పట్టుబడతామనే భయం, పట్టుబడితే కేసులు నమోదవుతాయనే ఆందోళన వారిలో కనిపించడం లేదనే చెప్పాలి. వీరి నిర్లక్ష్యం కారణంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.  

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 18 (విజయక్రాంతి): మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిని కట్టడి చేయడమే డ్రంక్ అండ్ డ్రైవ్ ముఖ్య ఉద్దేశమని అధికారులు పేర్కొంటున్నారు. హిట్ అండ్ రన్ కేసుల్లో పట్టుబడితే మర్డర్ చేయడంతో సమానమని, దానికి అనుగుణంగా శిక్షలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.  కానీ, ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నా అనుకున్న మేర ఫలితాలు రాబట్టలేకపోతున్నారు.  డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రతీ నెల సుమారు 2వేల వరకు, సైబరాబాద్  కమిషనరేట్ పరిధిలో 1500 నుంచి 1800 వరకు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 1000 నుంచి 1200 వరకు మందుబాబులు పట్టుబడుతున్నట్లు ట్రాఫిక్ అధికారులు తెలిపారు.

వరుస రోడ్డు ప్రమాదాలు.. 

డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ  ప్రమాదాలకు గురవడమే కాకుండా ఇతరుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. వారితో పాటు వారి కుటుంబసభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చుతున్నారు. మద్యం తాగి విచ్చలవిడిగా వాహ నాలు నడుపుతూ అర్ధరాత్రుళ్లు రోడ్లపై నానా హంగామా సృష్టిస్తూ వరుస ప్రమాదాలకు కారణమవుతున్నారు కొందరు ఆక తాయిలు. ఈ మధ్య జరిగిన సంఘటనలు.. స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల నేపథ్యం లో ఫుల్‌గా మద్యం తాగిన నలుగురు యువకులు కేక్ కట్ చేయించడానికి చార్మినార్‌కి వెళ్లారు.

అప్పటికే మద్యం మత్తులో ఉన్న వారి కారు మార్గమధ్యలో ఆటోను ఢీ కొడితే ఆటో పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇదంతా చూసిన అజయ్ అనే వ్యక్తి కారును ఆపేందకు ప్రయత్నించగా కారు అతడిని ఢీ కొట్టింది. దీంతో అజయ్ తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మరణించాడు. గత నెల 18వ తేదీన మాదాపూర్ ప్రాంతంలో జరిగిన మరో ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫుల్‌గా మద్యం సేవించి అతివేగంతో రోడ్డు పక్కన ఉన్న పాల వ్యాపారిని ఢీ కొట్టడంతో అతడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు.  ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే అధికం.. 

ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ఆయా ఏరియాల్లో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్ అధికంగా నివాసం ఉండటం, బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్‌లు ఎక్కువగా ఉండటం వలన అర్ధరాత్రుళ్ల వర కు మందు తాగిన ఆకతాయిలు పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నారు. మద్యం సేవించి తనిఖీల్లో పట్టుబ డిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. రానున్న రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పెంచి, మందు బాబులను కట్టడి చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తాం. 

 సుబ్బరాయుడు, 

హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ 

పట్టుబడితే జైలుకే..

ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో మద్యం సేవించి మొదటిసారి పట్టుబడితే అతనిపై కేసు నమోదు చేసి వారి కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు జరిమానా విధిస్తున్నారు. రెండో సారి పట్టుబడితే జరిమానాతో పాటు వారం రోజుల జైలు శిక్ష, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నారు. మూడో సారి పట్టుబడితే కేసు తీవ్రతను బట్టి 6 నెలల నుంచి జీవితకాలం పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు ఒక నెల నుంచి ఆరు నెలల  వరకు జైలు శిక్ష విధిస్తున్నారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించడానికి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ల పరిధిలోని బేగంపేట, గోషామహాల్, మాదాపూర్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 

తనిఖీలు పెంచాలి.. 

హైదరాబాద్‌లో వరుసగా జరుగుతు న్న రోడ్డు ప్రమాదాలతో బయటకి రావాలంటేనే భయంగా ఉంది. ఏదైనా అత్య వసర పని నిమిత్తం రాత్రి, తెల్లవారుజాము న బయటకి వచ్చామంటే తిరిగి గమ్యస్థానం చేరే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తుంది. రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల సమయాలను పెంచాలి. పట్టుబడిన వారిపై కఠిన శిక్షలు అమలు చేయాలి. వారాంతాల్లోనే కాకుం డా ప్రతిరోజు రాత్రి సమయాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలి. 

 రంజిత్, ప్రైవేట్ ఉద్యోగి