11 August, 2026 | 10:11 PM

పీజీఈసెట్ ఫలితాలు విడుదల

19-06-2024 12:21 AM
  • 91.28 శాతం ఉత్తీర్ణత నమోదు

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీజీఈసెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. కూకట్‌పల్లిలోని జేఎన్టీయూహెచ్‌లో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, జేఎన్టీయూ ఇన్‌చార్జి వీసీ బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి కలిసి ఫలితాలను విడుదల చేశారు. పరీక్ష నిర్వహించిన నాలుగు రోజుల్లోనే ఫలితాలను విడుదల చేయడం గమనార్హం. మొత్తం 22,712 మంది దరఖాస్తు చేసుకోగా 20,626 మంది పరీక్ష రాశారు. వీరిలో 18,829 (91.28 శాతం) మంది అర్హత సాధించారు. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి పాస్ పర్సంటేజీ తగ్గింది.

గతేడాది 93.34 శాతం కాగా ఈ సారి 91.28 శాతంగా నమోదైంది. విభాగాల వారీగా ర్యాంకుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అబ్బాయిలు 9,156 మంది, అమ్మాయిలు 11,470 మంది పరీక్షకు హాజరయ్యారు. అబ్బాయిలు 8,246 మంది, అమ్మాయిలు 10,583 మంది అర్హత సాధించారు. ఈ నెల 10 నుంచి 13 వరకు పీజీఈసెట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, జేఎన్టీ యూహెచ్ రెక్టార్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వర్‌రావు, పీజీఈసెట్ కన్వీనర్  అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.

  • త్వరలో సెర్చ్ కమిటీల తేదీలు 

వీసీల నియామకానికి సంబంధించి త్వరలోనే సెర్చ్ కమిటీల తేదీలను ప్రకటిస్తామని, అంతవరకూ ఇన్‌చార్జి వీసీలే కొనసాగుతారని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభమయ్యేలోపు కళాశాలల అఫిలియేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. కొన్ని కాలేజీలు సరైన విద్యా ప్రమాణాలను పాటించడంలేదని, చాలా కాలేజీల్లో సరైన ల్యాబులు, ఫ్యాకల్టీ లేరన్నారు. అటువంటి కళాశాలల యాజమాన్యాలను పిలిచి మాట్లాడుతామన్నారు. టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగతోందని, వాటిని కోర్టు ఆపమని ఎక్కడా చెప్పలేదన్నారు.