21-07-2025 12:15:06 AM
‘మన గరివిడి లక్ష్మి ఒచ్చేసింది.. ఇకన స్టేజిరెక్కి అగ్గిదీసేద్దంతే!..’ అంటూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ వదిలిన వీడియో సోషల్‌మీడియాలో ప్రస్తుతం దూసుకుపోతోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి కథను సినిమాగా ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తుందీ నిర్మాణ సంస్థ.
‘గరివిడి లక్ష్మి’ పేరుతో వస్తున్న ఈ సినిమాలో టైటిల్ రోల్ ఆనంది పోషిస్తోంది. నరేశ్, రాశి, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, కుశాలిని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
ఇదిలా ఉండగా మేకర్స్ ఆదివారం ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘ఆయమ్మి అడుగెడితో మన కుర్రోళ్లెవరూ నేల మీద నిలబడరటా.. ఆయమ్మి పాట పాడితే పండు ముసలోళ్లు పరుగెత్తుకొని వొస్తరటా.. ఆయమ్మి గజ్జెకడితే మన ఊరంతా ఊగిపోద్దటా..’ అంటూ గరివిడి లక్ష్మి పాత్రను పరిచయం చేసిన విధానం ఆకట్టుకుంది. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీత సారథ్యం వహిస్తుండగా, జే ఆదిత్య సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.