మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి
మనోహరాబాద్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌ను మల్టీ జోన్–I ఐజీపీ. చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్ శనివారం సందర్శించి పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, రిజిస్టర్లు స్టేషన్ నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బందితో ఐజీపీ మాట్లాడి, పోలీస్ స్టేషన్‌లో రికార్డుల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, కార్యాలయ నిర్వహణ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించే విధంగా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పెండింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదేవిధంగా నూతన మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక చర్యలు, చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించి, అవసరమైన సూచనలు ఆదేశాలను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు, ఐపీఎస్, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ వెంకటరాజగౌడ్, తదితర అధికారులు పాల్గొన్నారు.






