25-09-2025 03:13:33 PM
కల్వకుంట్ల గ్రామ సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాటాలు ఆగవు
కట్ట లింగస్వామి-డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి
మునుగోడు,(విజయక్రాంతి): గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పాదయాత్ర సిద్ధమవుతే ప్రజా ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు చేయడం ప్రభుత్వం అసమర్థత పాలనకు నిదర్శనమని డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి అన్నారు. గురువారం మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో నెలకొన్న సమస్యలలు బస్సు సౌకర్యం, ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా చైతన్య పాదయాత్రకు పిలుపునివ్వడంతో...పాదయాత్రను నిర్వహించకుండా నాయకులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం సిగ్గుచేటని అన్నారు.అక్రమ అరెస్టు అనేది అధికార పార్టీ నాయకుల చేతకానితనానికి నిదర్శనమని మండిపడ్డారు. గ్రామ సీమలే దేశానికి పట్టుకొమ్మలనటువంటి మాటలు నేడు నీటి మూటలుగానే మీలుగు తున్నాయని ఆరోపించారు.
గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాల్సిన పాలకులు ఆ విషయాన్ని మర్చిపోయి ఎన్నికల సమయంలో మాత్రమే వివిధ హామీల తోటి ప్రజలను మోసం చేసి పాలకులు పబ్బతి గడుపుకుంటున్నారని ఆరోపించారు. కల్వకుంట నుండి వెలమకన్నె గ్రామానికి మంజూరైన బీటీ రోడ్డును అసంపూర్తిగా వదిలేశారని దాన్ని తక్షణమే పూర్తి చేయాలని, ప్రాథమికపాఠశాల నుంచి కొండాపురం రోడ్డు వరకు బీటి రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రామానికి బస్సు సౌకర్యం కావాలని అనేక సంవత్సరాలుగా వివిధ రూపాల్లో పోరాట నిర్వహించిన అధికారులు, నాయకులు ఇప్పటివరకు కూడా స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. గ్రామం లో సుమారు 50 మంది విద్యార్థులు పై చదువుల కోసం నిత్యం ప్రైవేట్ వాహనాలలో ప్రయాణిస్తున్నారని తక్షణమే బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి ఉన్నత చదువులను కాపాడాలని కోరారు.
గ్రామంలో పూర్తిస్థాయిలో డ్రైనేజీ లేకపోవడం గ్రామంలో అక్కడక్కడ మురుగునీరు నిలువ ఉండడం వల్ల వ్యాధులు,వాసన రావడం వంటివి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యుత్ స్తంభాలకు వీధిలైట్లు లేకపోవడం, కొన్నిచోట్ల కరెంటు తీగలు క్రిందకు ఉండడం, కరెంటు స్తంభాలు కొన్నిచోట్ల వంగి ఉండటం వంటి సమస్యలు ఉన్నాయని వీటిని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.గ్రామ అభివృద్ధి సాధించేవరకు మా పోరాటాలు ఆగవని ఎన్ని నిర్బంధాలను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు, సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి పగిళ్ల మధు, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు మిరియాల భరత్, మండల అధ్యక్షులు బొడ్డుపల్లి నరేష్, డివైఎఫ్ఐ నాయకులు కట్ట ఆంజనేయులు,బొందు శివ,కుక్కల మహేష్,పగిల్ల యాదయ్య, నారగోని పవన్, గీత సంగం నాయకులు అయితేగోని యాదయ్య ఉన్నారు.