21 August, 2026 | 1:31 AM

అసైన్డ్ భూములలో అక్రమ కట్టడాలు

21-08-2026 12:52 AM
  1. చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు 
  2. పంచాయతీ కార్యదర్శికి స్పందించని జీపీఓ 
  3. పనులు నిలిపివేయించామన్న వర్గల్ తహసీల్దార్ 
  4. కొనసాగుతున్న అక్రమ నిర్మాణం

గజ్వేల్, ఆగస్టు 20 : పేదలకు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూముల్లో అనధికారిక నిర్మాణాలు కొనసాగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్గల్ మండలం నెంటూరు గ్రామంలోని సర్వే నంబర్ 144లో మొత్తం 119.06 ఎకరాల అసైన్డ్ భూమిని గతంలో భూమిలేని రైతులకు సాగు కోసం పంపిణీ చేశారు.

చాలా మంది రైతులు ఇప్పటికీ భూములను సాగు చేసుకుంటుండగా, మరికొందరు ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే భవన నిర్మాణాలు చేపడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సాగు చేసి జీవనోపాధి పొందాల్సిన భూములను ఇతర అవసరాలకు వినియోగించేందుకు నిర్మాణాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని వారు పేర్కొంటున్నారు. అక్రమ నిర్మాణాల విషయాన్ని స్థానిక పంచాయతీ కార్యదర్శి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు కనిపించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.

పంచాయతీ కార్యదర్శి జిపీఓకు సమాచారం ఇచ్చినా స్పందన లేదనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు నిర్మాణ పనులు నిలిపివేయించామని వర్గల్ తహసీల్దార్ పేర్కొన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో అధికారులు చెప్పేదొకటి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నదొకటిగా పరిస్థితి మారిందని విమర్శిస్తున్నారు.

అసైన్డ్ భూముల్లో జరుగుతున్న నిర్మాణాలపై సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలపై చర్యలు తీసుకోవడంతో పాటు భూములను ప్రభుత్వం నిర్దేశించిన ప్రయోజనాలకే వినియోగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

రికార్డు కొంత.... సాగు చేసేది ఎంత? 

నెంటూరు గ్రామంలో  ప్రభుత్వం పేద రైతులకు సాగు చేసుకుని జీవనోపాధి పొందడానికి ఇచ్చిన దానికంటే రైతులు ఎక్కువ భూమిని సాగు చేస్తున్నారని పలువురు గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. రైతులకు ప్రభుత్వం భూమి పంపిణీ చేయగా, పంట సాగు చేస్తున్న సమయంలో అడవి జంతువులు పాడు చేసేవని, మరికొందరు పెద్ద కొన్ని సంవత్సరాల క్రితం వరకు తాగునీటికి కరువు ఏర్పడడంతో  ఊరు విడిచి ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లారు.

భూగర్భ జలాలు ఎక్కువ కావడంతో తిరిగి గ్రామాలకు వచ్చి రైతులు తమ భూమిని సాగు చేసుకోవడానికి  చూసేసరికి ఇతర రైతులు వారి భూమిని  సాగు చేయడంతో నివ్వెర పోయారు. తమ భూమి తమకు ఇప్పించి వ్యవసాయం చేసుకునే అవకాశం కల్పించాలని రైతులు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొందరు రైతులు అక్రమంగా ఇతర భూములను సైతం తమ పేరును మార్చుకోవడానికి ఇటీవల ప్రయత్నాలు చేయగా  అసలు యజమానులు ఆ చర్యలను అడ్డుకోవడం జరిగింది. ఇలా చాలామంది రైతులకు చెందిన భూములను ఇతర రైతులు సాగు చేస్తుండడంతో అసలు రైతులు అన్యాయానికి గురవుతున్నామని వాపోతున్నారు. అధికారులు ఈ విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పనులు నిలిపివేయాలని జిపిఓను ఆదేశించాం: ఆకుల శ్రీకాంత్, వర్గల్ తహసిల్దార్ మండల పరిధిలోని నెంటూరు  గ్రామంలో నిర్మాణాలు చేపట్టడం చట్ట విరుద్ధం. ఈ విషయం నా దృష్టికి రాగానే జిపిఓను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. రైతుల భూ సమస్యలను పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తాం.